Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా విద్యాసంస్థలపై కేసు
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:20 AM
బీఆర్‌ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
నాడెం చెరువు బఫర్ జోన్‌లో అనురాగ్ విద్యా సంస్థలు, గాయత్రి ట్రస్ట్ నిర్మాణాలు
నీటిపారుదల ఏఈ ఫిర్యాదుతో కేసు
నిబంధనల ప్రకారమే భవన నిర్మాణాలు
ప్రభుత్వం కక్ష కట్టింది: రాజేశ్వర్‌రెడ్డి
ఘట్‌కేసర్ రూరల్/హైదరాబాద్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు.. మేడ్చల్ జిల్లాలోని నాడెం చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టాయంటూ నీటిపారుదల శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం, వెంకటాపూర్ పంచాయతీ, కొర్రెముల రెవెన్యూ పరిధిలోని 813 సర్వే నంబర్‌లో ఈ విద్యాసంస్థలు పలు నిర్మాణాలు చేపట్టాయి.
అయితే నాడెం చెరువుకు 30 మీటర్ల బఫర్‌జోన్ వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, సదరు విద్యాసంస్థల యాజమాన్యం ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో మండల ఇరిగేషన్ ఏఈ పరమేశ్ ఈ నెల 22న బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను పరిశీలించి వాల్టా చట్టం కింద పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజువర్మ తెలిపారు.
కాగా, గతంలో నంగార భేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణే్‌షనాయక్.. నాడెం చెరువు బఫర్‌జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గణే్‌షనాయక్ హైకోర్టును ఆశ్రయించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
కక్షపూరితంగా ప్రభుత్వ చర్యలు: పల్లా
తాము అన్ని అనుమతులు, నిబంధనల మేరకే భవన నిర్మాణాలు చేపట్టామని అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తనపై, తన విద్యాసంస్థలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు సంబంధించిన విద్యాజ్యోతి కళాశాల, కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ అనుమతులు ఇచ్చిన తరువాత కూడా ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో 480 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో 99 శాతం కళాశాలలకు అనుమతులు ఇచ్చి.. తన కళాశాలకు మాత్రం అనుమతులు ఇవ్వకుండా కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు.
తన విద్యాసంస్థలపై ఇప్పటికే విజిలెన్స్, ఇంటెలిజెన్స్, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖల ద్వారా నిత్యం సోదాలు చేస్తున్నారని తెలిపారు. అయినా ఏ తప్పులూ దొరక్కపోవడంతో 2017లో అనుమతులు ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనపై మరో కేసు నమోదు చేశారని ఆరోపించారు. తద్వారా అనురాగ్ యూనివర్సిటీని, అందులో చదువుతున్న విద్యార్థులను, తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వైద్య కళాశాల నిర్మాణం జరిగిన సర్వే నంబరు 813/పి, 796/పికి సంబంధించి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చిన పత్రాలనూ పరిశీలించలేదన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చట్టప్రకారమే నడుచుకుంటానని పేర్కొన్నారు.
Updated Date - Aug 25 , 2024 | 04:20 AM