KTR: ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిన కేటీఆర్
ABN, Publish Date - Sep 02 , 2024 | 09:50 PM
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోల్చి మరీ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోల్చి మరీ విమర్శలు గుప్పించారు. ‘‘ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం 6 రెస్క్యూ హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్‌లను ఉపయోగిస్తోంది. మన తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లను ఉపయోగించి ఎన్ని ప్రాణాలు కాపాడగలిగారో ఊహించండి?. పెద్ద సున్నా’’ అని అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
కాంగ్రెస్ మంత్రులపైనా విమర్శలు
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని 27 ఆగస్టు నాడు చెప్పిందని, ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందని కేటీఆర్ ప్రస్తావించారు. కానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని విమర్శలు గుప్పించారు. ‘‘ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు!. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు.. ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రం సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు. జరగాల్సిన నష్టమంతా జరిగాక. పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు!’’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
Updated Date - Sep 02 , 2024 | 10:05 PM