CM Revanth Reddy: సచివాలయంలో వాస్తుమార్పులు!
ABN, Publish Date - Jun 04 , 2024 | 05:31 AM
సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా.? ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి, వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి తాజా పరిణామాలు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలతో లాక్ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్నిస్తున్నాయి.
సీఎం రాకపోకల గేట్లనూ మార్చే యోచన
ఈశాన్య గేటు నుంచే ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్!
లేదంటే పడమర గేటు నుంచి లోపలికి వచ్చి ఈశాన్య గేటు గుండా బయటకు వెళ్లేలా ప్లాన్
ఐఏఎస్, ఐపీఎస్‌ల రాకపోకలు ఆగ్నేయ గేటు నుంచి
సోమవారం ఈశాన్య గేటు నుంచి వచ్చివెళ్లిన సీఎస్
సీఎం కార్యాలయమూ తొమ్మిదో అంతస్తుకు మార్పు!
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా.? ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి, వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి తాజా పరిణామాలు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలతో లాక్ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్నిస్తున్నాయి. వాస్తు మార్పుల్లో భాగంగా ఇప్పటివరకు సీఎం వచ్చి వెళ్తున్న ప్రధాన ద్వారం కాకుండా.. వేరే గేట్ల నుంచి రాకపోకలు సాగించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్ రెండూ ఈశాన్య గేటు (ఎన్టీఆర్ గార్డెన్ వైపున్న నార్త్ ఈస్ట్ గేట్ నంబర్ 4) నుంచే ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు పడమర గేటు (మసీదు, చర్చి వైపు, వెస్ట్ గేట్ నంబర్ 3) నుంచి సచివాలయంలోకి వచ్చి.. ఈశాన్య గేటు నుంచి బయటకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వెస్ట్ గేటు వైపు మసీదు, చర్చి ఉండడం, ఆయా మతాల వారు అక్కడ నిత్యం ప్రార్థనలు చేస్తుండడంతో.. ముఖ్యమంత్రి ఆ గేటు నుంచి లోపలికి వచ్చేందుకు భద్రత పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఈశాన్య గేటు నుంచి అయితేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. ఈ మేరకు ఈశాన్య గేటు నుంచి రాకపోకలు జరిపితే ట్రాఫిక్ సహా ఇతర పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై సెక్రటేరియట్ సెక్యూరిటీ టీమ్ అంచనాలు వేసినట్లు తెలిసింది. మరోవైపు సీఎం సచివాలయంలోకి (సెక్రటేరియట్ లోపలి ఎంట్రీ పాయింట్, బాహుబలి తలుపుల కింది భాగం) వచ్చే మార్గంలో ఉన్న సింగిల్ గేటు స్థానంతోపాటు, మసీదు, చర్చి వైపు వెళ్లేందుకు ఉన్న సింగిల్ గేటు స్థానంలోనూ ఐరన్ డబుల్ గ్రిల్ గేట్లను అమర్చారు. దీంతో సీఎం రాకపోకలు, వాస్తు మార్పులో భాగంగానే ముందుగా ఆ గేట్లను మార్చారనే చర్చ జరుగుతోంది.
ఐఏఎస్, ఐపీఎ్‌సల గేట్లూ మార్పు..
ఐఏఎస్, ఐపీఎ్‌సలు సౌత్ ఈస్ట్ గేటు (ఆగ్నేయం, గేట్ నంబర్ 2) నుంచి సచివాలయంలోకి రానున్నారు. సీఎం ఎంట్రీ, ఎగ్జిట్‌లు నార్త్‌ఈస్ట్ గేటు నుంచి జరిగితే.. అధికారులకు ఆ మార్గం ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ సీఎం రాకపోకల గేట్లు మారితే.. అధికారులు వచ్చివెళ్లే గేట్లు కూడా మారనున్నాయి. కాగా, ఇప్పటివరకు ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చివెళ్లే ప్రధాన ద్వారం (ఈస్ట్ గేట్ నెంబర్ 1, అమరుల స్మారక స్తూపం వైపు ఉన్న గేటు) ద్వారా రాకపోకలు సాగించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా తన మార్గాన్ని మార్చుకోనున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆమె ఈశాన్య గేటు నుంచే సెక్రటే రియట్‌లోకి వచ్చి, అదే గేటు నుంచి బయటకు వెళ్లారు. సీఎం వచ్చివెళ్లే మార్గాల గుండానే రాకపోకలు సాగించిన సీఎస్ సోమవారం ఈశాన్య గేటు నుంచి వచ్చి, వెళ్లడంతో.. ముఖ్యమంత్రి రాకపోకలు కూడా ఈశాన్య గేటు నుంచే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ గేటు నుంచి వచ్చి వెళతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సీఎం రాకపోకలకు సంబంధించి గేట్ల విషయంపై ఇంకా సాధారణ పరిపాలన విభాగం నుంచి సెక్రటేరియట్ సెక్యూరిటీ టీమ్‌కు ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం.
సీఎం కార్యాలయం.. ఆరు నుంచి తొమ్మిదికి.!
సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మారనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం త్వరలో 9వ అంతస్తులోకి మారుతుందంటున్నారు. ఈ మేరకు ఇంటీరియర్, ఫర్నీచర్ కోసం పలువురు నిపుణులు తొమ్మిదో అంతస్తును ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. నిజానికి ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేసిన తర్వాత కొద్దిరోజులకే సీఎం కార్యాలయం తొమ్మిదో అంతస్తుకు మారనుందనే ప్రచారం జరిగింది. కానీ అలా ఏమీ జరగలేదు. మళ్లీ ఇప్పుడు సచివాలయంలో వాస్తు మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో సీఎం కార్యాలయం మార్పు చర్చ జరుగుతోంది. వాస్తవానికి సచివాలయ భవనం నిర్మాణం 11 అంతస్తుల్లో జరిగింది. అందులో 6 అంతస్తుల వరకు మాత్రమే బయటకు కనిపిస్తున్నప్పటికీ.. డోమ్‌ల కింద కూడా కొన్ని ఫ్లోర్‌లు ఉన్నాయి. అయితే గత సీఎం 6 అంకెను తన అదృష్ట సంఖ్యగా విశ్వసించేవారు. అందుకే తన కార్యాలయాన్ని కూడా 6వ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్ 9 అంకెను అదృష్ట సంఖ్యగా విశ్వసిస్తారు. ఆయన వినియోగించే కార్ల నెంబర్లు కూడా 9 అంకెతోనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సచివాలయంలో తన కార్యాలయాన్ని 9వ ఫ్లోర్‌కు మార్చుకుంటున్నారని అంటున్నారు.
వాస్తు మార్పు.. ఇదీ చర్చ.!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయాన్ని ప్రముఖ వాస్తు నిపుణులు పరిశీలించి, ఖరారు చేసిన తరువాతే నిర్మాణం చేపట్టారు. పైగా అప్పటి సీఎం కేసీఆర్ కూడా వాస్తుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాస్తు మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా పాత సచివాలయం కూల్చివేతకు ముందువరకు ఉన్న ‘నల్లపోచమ్మ’ గుడిని కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయిన తరువాత భవనం వెనుక భాగంలో ఉంచారని, ఇది సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా.. సెక్రటేరియట్ కంటే కొంత కిందికి గుడి ఉందని, అలా ఉండడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలున్నాయి. దీంతోపాటు తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారం కూడా సచివాలయం నిర్మాణం సమయంలో సూచించిన విధంగా వాస్తు ప్రకారం లేదనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ రెండు అంశాల నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయానికి సీఎం వచ్చి, వెళ్లే రాకపోకలను మారుస్తున్నట్టు తెలుస్తోంది.
Updated Date - Jun 04 , 2024 | 05:31 AM