Telangana : ‘శిశు’పాపులు!
ABN, Publish Date - May 29 , 2024 | 06:27 AM
వారంతా ఏ తల్లులు కని వదిలేసిన శిశువులో కానీ అంగట్లో సరుకుగా మారారు. తమకో బిడ్డ కావాలని సంప్రదిస్తే చాలు.. వాట్సా్‌పలో వెంటనే ఓ నాలుగైదు ఫొటోలు పంపుతారు.
అంగట్లో సరుకుగా నెలల వయసు బిడ్డలు
ఢిల్లీ, ముంబై, పుణె కేంద్రాలుగా.. వాట్సాప్‌లో ఫొటోలు పెట్టి మరీ విక్రయం
తెలంగాణ, ఏపీల్లో పిల్లలు లేనివారి కోసమే.. రూ.5 లక్షల ధర
బేరం కుదిరితే రెండ్రోజుల్లో అందజేత.. మహిళా ఆర్‌ఎంపీపై స్టింగ్ ఆపరేషన్
అంతర్రాష్ట ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు
16 మంది శిశువుల స్వాధీనం.. అదుపులో 30 మంది నిందితులు
ఆరేళ్లలో 60 మంది పిల్లలను విక్రయించినట్లు నిర్ధారణ
వాట్సా్‌పలో ఫొటోలు పెట్టి మరీ విక్రయం
అంతర్రాష్ట ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్ సిటీ, మే 28(ఆంధ్రజ్యోతి): వారంతా ఏ తల్లులు కని వదిలేసిన శిశువులో కానీ అంగట్లో సరుకుగా మారారు. తమకో బిడ్డ కావాలని సంప్రదిస్తే చాలు.. వాట్సా్‌పలో వెంటనే ఓ నాలుగైదు ఫొటోలు పంపుతారు. నచ్చిన శిశువును ఎంపిక చేసుకొని.. వారు చెప్పిన ధరకు ఓకే అనేసి, అడ్వాన్స్ కొంత ముట్టజెబితే, రెండంటే రెండ్రోజుల్లో బిడ్డను అప్పగించేస్తారు. బేరం కుదిరిన తాలూకు డబ్బంతా చేతుల్లో పడగానే.. కమీషన్లు వెళ్లే వారికి కమీషన్లు.. అసలు వెళ్లేవారికి అసలూ చేరిపోతాయ్! తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకొని ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా హైదరాబాద్‌లో శిశు విక్రయ ముఠా నడిపిస్తున్న దందా ఇది! ఓ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే.. రాచకొండ పోలీసులు కొందర్ని వలపన్ని పట్టుకోవడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
ఇప్పటిదాకా ముఠా విక్రయించిన 16 మంది శిశువులను పోలీసులు స్వాధీనం చేసుకొని సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ శిశువులంతా కూడా 23 రోజులు, నెల, నెలన్నర, రెండు నెలల వయసున్న పసిగుడ్లే!! అంతర్రాష్ట్ర ముఠా అక్రమ దందాపై మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డితో కలిసి రాచకొండ సీపీ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు.
పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణ నగర్‌లో శోభారాణి అనే మహిళ ఆర్‌ఎంపీ. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతోంది. కొన్నాళ్లుగా పిల్లలు లేని దంపతుల కోసం ఇతర ప్రాంతాల నుంచి శిశువులను తెప్పించి గుట్టుగా విక్రయిస్తోంది. ఈ దందాలో భాగంగా ఒక్కో శిశువుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా తీసుకుంటోంది. దీనిపై అక్షర ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు ఉప్పందింది. ఆ సంస్థ ఫౌండర్ అనూష, సంస్థ ప్రతినిఽధులు వైష్ణవి, ప్రత్యూష, రవి, సియోన్, శృతివర్ధన్‌లతో కలిసి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
తమకు ఒక బేబీ కావాలని వారు వెళ్లి అడిగితే శోభారాణి సరేనంది. రూ.4.50 లక్షలకు బేరం కుదిరింది. సంస్థ ప్రతినిధులు అడ్వాన్సుగా రూ.10వేలు శోభారాణి చేతుల్లో పెట్టారు. తర్వాత ఈ నెల 22న సంస్థ ప్రతినిధులు మిగతా డబ్బుతో శోభారాణి వద్దకు వెళ్లగా రెండు నెలల ఆడ శిశువుతో ఆమె సిద్ధంగా ఉంది. అప్పటికే స్వచ్ఛంద సంస్థ సూచనతో మాటువేసిన మేడిగడ్డ పోలీసులు, నిందితురాలు శోభారాణిని అదుపులోకి తీసుకున్నారు.
శోభారాణి ఇచ్చిన సమాచారంతో ఆమెకు సహకరించిన షేక్ సలీం పాషా అనే వ్యక్తిని, చింత స్వప్న అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. శోభారాణిని, ఆమె అనుచరులను విచారించగా ఘట్కేసర్‌కు చెందిన బండారి పద్మ, బండారి హరిహర చేతన్, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముదావత్ శారద, జగన్నాఽథం అనురాధ, మహబూబ్‌నగర్‌కు చెందిన ముదావత్ రాజు, విజయవాడకు చెందిన పతన్ ముంతాజ్, చర్లపల్లి కుషాయిగూడకు చెందిన యాట మమతల పేర్లు వెలుగులోకొచ్చాయి.
వాట్సా్‌పలో ఫొటోలు పెట్టి బేరం..
ఈ ఏజెంట్లంతా ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్య, ముంబైకి చెందిన మరికొంతమందితో లింకులు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలకోసం ఎవరైనా సంప్రందిస్తే.. వెంటనే ఈ ఏజెంట్లు ఢిల్లీ ప్రతినిధులకు సమాచారమిస్తారు. ఢిల్లీనుంచి వారు శిశువుల ఫొటోలను వాట్సా్‌పలో పంపుతారు.
వాటిని ఇక్కడి ఏజెంట్లు కస్టమర్స్‌కు వాట్సాప్ చేస్తారు. వారు నచ్చిన శిశువును ఎంపిక చేసు కోగానే బేరం మాట్లాడుతారు. ఇక్కడి ఏజెంట్లు తమ కమీషన్ కలుపుకొని బేరం కుదుర్చుకున్నాక ఇక్కడి ఏజెంట్లు ఢిల్లీ, పుణె, ముంబైలకు వెళ్లి.. అక్కడ ముఠా సభ్యులను కలిసి ఎంపిక చేసుకున్న శిశువును తెచ్చి ఇస్తారు. దళారులు, ఏజెంట్లు, డిల్లీ, పుణె, ముంబైకి చెందిన ముఠాలు ఆరేళ్లలో 60 మంది వరకు శిశువులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇప్పటి వరకు అరెస్టయిన వారి వెనకాల ఉన్నవారిని పట్టుకుంటే ఈ అక్రమ దందాలో ఇంకాన్ని ముఠాలున్నాయి? ఎంతమందితో నెట్‌వర్క్ విస్తరించింది? అనేవి తెలుస్తాయని సీపీ వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, పుణె కేంద్రాలుగా నడుస్తున్న ఈ భారీ నెట్‌వర్క్‌ను చేదించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. రాచకొండ పోలీసులు ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీల్లో ముఠా విక్రయించిన 16 మంది శిశువులను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11 మంది ఏజెంట్లను, దళారులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. చిన్నారులను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సహా 19 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Updated Date - May 29 , 2024 | 06:27 AM