Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన చిరంజీవి.. ఎంతంటే..
ABN, Publish Date - Sep 04 , 2024 | 09:44 AM
వర్షాల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఎంత సహాయం అందిస్తున్నా కూడా నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సాయం అందించలేకపోతున్నాయి.
హైదరాబాద్: వర్షాల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఎంత సహాయం అందిస్తున్నా కూడా నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సాయం అందించలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాతల నుంచి విరాళాలు కోరుతున్నాయి. దీనికి స్పందన కూడా భారీగానే వస్తోంది. తెలంగాణలో అయితే ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని అంటే రూ.100 కోట్లు విరాళంగా అందించనున్నట్టు ప్రకటించాయి. ఇక దాతలు సైతం తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, ఎన్నారైలు తమ సాయాన్ని ప్రకటిస్తున్నారు.
అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం..
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి సైతం తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షలు విరాళంగా అందించనున్నట్టు ప్రకటించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్టార్ హీరో ఎన్టీఆర్ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు చిరు కూడా తన విరాళాన్ని ప్రకటించారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని చిరు పేర్కొన్నారు.
నారా భువనేశ్వరి, పవన్ విరాళం..
వరద బాధితులను ఆదుకునేందుకు హెరిటేజ్ ఫుడ్స్ చైర్మన్ నారా భువనేశ్వరి సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు చొప్పున ఆమె విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధికి హెరిటేజ్ ఫుడ్స్ చెక్కులు పంపనుంది. కష్టాల్లో ఉన్న బాధితులను అధికొనేందుకు తమ సహాయం ఉపయోగపడుతుందని భువనేశ్వరి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన విరాళాన్ని అందించనున్నారు.
Updated Date - Sep 04 , 2024 | 09:44 AM