Bhatti Vikramarka: ఆన్‌లైన్ నమోదే కీలకం.. పొరపాట్లు జరగొద్దు
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:46 AM
సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ పొరపాట్లకు అవకాశం లేకుండా వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
వలస వెళ్లిన వారి వివరాలూ సేకరించాల్సిందే..
‘సమగ్ర సర్వే’పై అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ పొరపాట్లకు అవకాశం లేకుండా వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలొస్తే, వారికి ఫోన్ చేసి సర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్లిన వివరాలను జాగ్రత్తగా సేకరించాలన్నారు. ఇక ఇటీవల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలుషితాహారం వల్ల విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనలపై భట్టి ఆరా తీశారు. పాఠశాలల్లో ఆహారం మరియు పరిశుభ్రతపైనే సీఎం రేవంత్, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దేశాన్ని వికృత పార్టీ పాలిస్తోంది..
ఈ దేశాన్ని ఒక వికృత పార్టీ పరిపాలిస్తోందని, ఆ పార్టీని కాదని మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని ఝార్ఖండ్‌లో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి సూచించారు. ఏఐసీసీ పరిశీలకుడిగా ఉన్న ఆయన.. సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ కీలక నేతలతో కలిసి చర్చలు జరిపారు. సాయంత్రం రాంచీలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భట్టి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తు న్న పార్టీని కాదని.. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. వలసపాలన నుంచి దేశానికి కాంగ్రెస్ విముక్తి కల్పించిందని.. ఈ పార్టీలో పనిచేయడం ఓ అదృష్టమని చెప్పారు.
Updated Date - Nov 25 , 2024 | 02:46 AM