CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:57 AM
భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్థం ప్రకటించిన బీజెపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందని.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలను అదిరించి, బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం
అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది
లోక్‌సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండమే!
మోదీ రాకముందు మనదేశ అప్పు 54 లక్షల కోట్లు
పదేళ్లలో ఆయన 113 లక్షల కోట్లు అప్పు చేశారు
డబులింజన్ అంటే.. అదానీ, ప్రధాని: రేవంత్‌రెడ్డి
‘నయవంచన.. పదేళ్ల మోసం-వందేళ్ల విధ్వంసం’
పేరిట బీజేపీపై చార్జిషీట్ విడుదల
బీజేపీ అంటే బ్రిటిష్ జనతాపార్టీ: సీఎం రేవంత్
కంటోన్మెంట్‌ను గ్రేటర్‌లో కలుపుతామని హామీ
నేడు పెద్దశంకరంపేటలో జనజాతర సభకు సీఎం
హైదరాబాద్/సిటీ, రాజేంద్రనగర్, నారాయణ్‌ఖేడ్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్థం ప్రకటించిన బీజెపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందని.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలను అదిరించి, బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకుందని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉండాలా?వద్దా? అనే అంశంపై రెఫరెండమే ప్రస్తుతఎన్నికలని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రేవంత్.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులతో కలిసి ‘నయవంచన.. పదేళ్లమోసం-వందేళ్ల విధ్వంసం’ పేరిట బీజేపీపై రూపొందించిన చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. బీజేపీ కుట్రల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన పలు హామీల అమలులో ఎలా విఫలమైందీ రేవంత్ గణాంకాలతో సహా వివరించారు. ప్రధాని మోదీ దేశాన్ని రూ.168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని విమర్శిచారు. గతంలో 14 మంది ప్రధానులు రూ.54 లక్షల కోట్లు అప్పులు చేేస్త.. మోదీ ప్రభుత్వం కేవలం పదేళ్లలో రూ.113 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టిన ఆస్తులను మోదీ ప్రభుత్వం పదేళ్లలో కార్పొరేట్‌లకు కట్టబెట్టిందని విమర్శించారు. 2025 నాటికి ఆరెస్సెస్ ఆవిర్భవించి వందేళ్లు అవుతుందని.. అప్పటికి రిజర్వేషన్లు రద్దు చేయాలనే విధానంతో సంఘ్ ఉందని, ఆ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. మండల్ కమిషన్ సిఫారసు మేరకు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే కమండల్ పేరిట కమలనాథులు రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తుచేశారు. అలాంటిది.. వర్గీకరణ కోసం కొట్లాడినవారు ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజెపీ వైపు నిలబడవద్దని సూచించారు. కుల గణన పూర్తిచేసి, దేశంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలుకు రాహుల్‌గాంధీ కట్టుబడి ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. అంతకు ముందు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్లలో దేశంలోని అన్ని వర్గాలకూ బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా విశ్వాస్’ అంటూ ప్రధాని మోదీ అందరి ఓట్లూ తీసుకుని.. ‘సబ్‌కా సత్తెనాశ్’ అంటూ అన్ని వర్గాలనూ అథోగతిపాలు చేశారని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు ఎ.అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష కోట్లతో మూసీ అభివృద్ధి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సీఎం రేవంత్ గురువారం రాత్రి చేవెళ్ల ఎంపీ అభరిఇ్థ రంజిత్ రెడ్డితో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడ, అత్తాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ అని.. ఆ పార్టీది బ్రిటీషోళ్ల ఎజెండా అని ధ్వజమెత్తారు. దేశ ప్రజలను బానిసలుగా చేసి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ గుజరాత్‌లోని సూరత్ నుంచి వచ్చిందని.. దాన్ని ఆదర్శంగా తీసుకున్న మోదీ, అమిత్ షా కూడా సూరత్ నుంచే వచ్చారని విమర్శించారు. బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడు దేశంలో రిజర్వేషన్లు లేవని.. ఇప్పుడు కూడా లేకుండా చేసేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. కేసీఆర్ బస్సుయాత్రను చూస్తుంటే.. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సచివాలయానికి రాలేదని.. ప్రజలను ప్రగతిభవన్‌కు రానివ్వలేదని విమర్శించారు. రూ.లక్ష కోట్లతో మూసీనదిని అభివృద్ధి చేస్తానని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. లక్ష ఓట్ల ఆధిక్యంతో రంజిత్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా.. ప్రచారంలో భాగంగా హైదర్‌గూడకు చేరుకున్న సీఎం రేవంత్ సమక్షంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉప్పర్‌పల్లికి చెందిన సామ ఇంద్రపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం... కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డితో కలిసి కంటోన్మెంట్ పరిధిలోని అన్నానగర్‌లో గురువారం రాత్రి సీఎం రోడ్‌షో నిర్వహించారు. వారిద్దరినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌లో ఎన్నో కుట్రలతో ఓడిన తనను.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తనను లోక్‌సభకు పంపారని గుర్తుచేసుకున్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో కలిపితేనే ఆ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం పేర్కొన్నారు. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ పాల్గొననున్నారు.
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌లో సామాన్యుడికి చికిత్స
రేవంత్ ప్రసంగిస్తుండగా రోడ్ షోకు హాజరైన ఒక వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ప్రసంగాన్ని ఆపిన సీఎం.. అతడికి వెంటనే నీరు తాగించాలని, పక్కనే ఉన్న తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి ప్రథమచికిత్స చేయాలని వైద్యులకు వేదికపైనుంచే సూచించారు. దీంతో రేవంత్ భద్రతా సిబ్బంది హుటహుటిన ఆ వ్యక్తిని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స చేశారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజలు సీఎం.. సీఎం అంటూ పెద్దపెట్టున జయజయధ్వానాలు చేశారు.
రక్తంతో సీఎం రేవంత్ చిత్రపటం
సీఎంకు కానుకగా అందించిన యువకుడు
మడికొండ, వరంగల్ కార్పొరేషన్: తన రక్తంతో అభిమాన నాయకుడి చిత్రపటాన్ని గీయించి తాను ఎంతగానో ఇష్టపడే నేతపై ప్రేమను చాటుకున్నాడో యువకుడు. హనుమకొండ జిల్లాకు చెందిన తోట పవన్.. రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఓ సారి పవన్‌పై దాడి జరగడంతో రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ‘‘భయం వద్దు.. నేనున్నా’’ అంటూ తనలో ధైర్యం నింపారని, అప్పటి నుంచి ఆయనపై అభిమానం మరింతగా పెరిగిందని పవన్ తెలిపారు. ఈ క్రమంలో తన రక్తంతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రం గీయించాడు. బుధవారం మడికొండలో జరిగిన జన జాతర సభలో సీఎంకు బహుమతిగా అందజేసి అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా, జనజాతర సభలో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై హనుమకొండ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులను అక్కున చేర్చుకుందని కొనియాడారు.
Updated Date - Apr 26 , 2024 | 05:58 AM