CM Revanth Reddy: 14న రెండో విడత సమీకృత గురుకులాల శంకుస్థాపన
ABN, Publish Date - Nov 07 , 2024 | 02:27 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాలలను (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్) రెండో విడతలో మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించారు.
వచ్చే విద్యాసంవత్సరంలోపు తొలి విడత స్కూళ్ల పూర్తి
ఉపాధి కల్పించే విద్య రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
విద్యార్థులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాలలను (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్) రెండో విడతలో మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. నవంబరు-14న చాచా నెహ్రూ జయంతి సందర్భంగా రెండో విడత నిర్మాణ పనులు చేపడతామన్నారు. తొలివిడతలో మంజూరు చేసిన పాఠశాలల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి నుంచి వచ్చిన విద్యార్థులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం వారితో ముఖాముఖి మాట్లాడారు. ఉపాధి అందించే నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని వివరించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామన్నారు.
స్కిల్స్ వర్సిటీ ఏర్పాటు అందుకే!
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేశామన్నారు. ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని విద్యార్థులను ఉద్దేశించి సీఎం కోరారు.
Updated Date - Nov 07 , 2024 | 02:27 AM