ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు

ABN, Publish Date - Nov 09 , 2024 | 04:33 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

  • యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట: సీఎం పుట్టినరోజున స్వామివారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

యాదాద్రి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. టీటీడీ స్థాయిలో ప్రాధాన్యం ఉండేలా దీనిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. యాదాద్రిని ఇకనుంచి యాదగిరిగుట్టగా పిలవాలని, ఈ మేరకు అన్ని రికార్డుల్లోనూ పేరును అధికారికంగా మార్చాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి తన పుట్టినరోజును పురస్కరించుకుని లక్ష్మీనృసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆలయానికి సంబంధించిన పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూసేకరణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా భక్తులు కొండపైన నిద్రించేందుకు చర్యలు చేపట్టాలని, పాత ఆచారాల పునరుద్ధరణలో భాగంగా ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. దేవస్థానానికి సంబంధించిన గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 2025లో జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు.


  • సీఎం పర్యటన సాగిందిలా..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని దర్శించుకునేందుకు హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం స్వాగతం పలికారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్లి 20నిమిషాల తర్వాత సీఎం కాన్వాయ్‌ కొండపైకి బయలుదేరింది. విష్ణుపుష్కరిణిలో స్నాన సంకల్పం చేసిన సీఎం.. తూర్పు రాజగోపురం ఎదురుగా స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి అఖండ దీపారాధన తర్వాత కొబ్బరికాయ సమర్పించారు. త్రితల గోపురం వద్దకు చేరుకోగానే ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలోని స్వయంభువులను దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలుచేశారు.


ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకున్న సీఎం... మంత్రులు, సీఎస్‌, అధికారులతో కలిసి వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక నేతలంతా శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టడంతో పరిస్థితి అదుపుతప్పి గందరగోళం నెలకొంది. తూర్పు రాజగోపురం వెళ్లేందుకు సీఎం, మంత్రులు నేతలను తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అక్కడున్న నేతలంతా కూడా ఒకేసారి ఆలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా... మంత్రి కొండా సురేఖ అతి కష్టమ్మీద ప్రధానాలయంలోకి వెళ్లారు. సీఎం, మంత్రులతో పాటు కొంతమంది నేతలు ఆలయంలోకి చొచ్చుకుపోగా, మరికొంతమంది వెళ్లే ప్రయత్నాన్ని అదుపు చేయలేక కొద్దిసేపు ద్వారబంధనం చేశారు. తిరిగి ఉత్తర ద్వారం నుంచి సీఎం బయటకు వచ్చేటప్పుడు కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది.

Updated Date - Nov 09 , 2024 | 04:33 AM