CM Revanth Reddy: 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ
ABN, Publish Date - Nov 15 , 2024 | 03:41 AM
‘‘ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు ప్రస్తుతం 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఈ వయో పరిమితిని కుదించాలి.
వయో పరిమితి తగ్గించాలి
అప్పుడే యువత రాణించే చాన్స్
రాజకీయాల్లోకి వచ్చే అవకాశం
పిల్లల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు ప్రస్తుతం 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఈ వయో పరిమితిని కుదించాలి. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అప్పుడు మరింతమంది యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్సీఈఆర్టీ కార్యాలయంలో గురువారం చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీకి వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గిస్తేనే యువత రాజకీయాల్లో రాణిస్తుందని చెప్పారు. ఈ మేరకు పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి, రాష్ట్రపతికి పంపించాలని సూచించారు.
ఈ అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు సూచించారు. యువత రాజకీయాల్లోకి వస్తే.. యువతకు ఏం అవసరమనే అంశంపై చట్ట సభల్లో చర్చించడానికి అవకాశం ఉంటుందన్నారు. మీలో కొందరైనా శాసన సభకు ఎన్నిక కావాలని, రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణ వంటి బిల్లులను పిల్లల మాక్ అసెంబ్లీలో ఆమోదించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మాక్ అసెంబ్లీసమావేశాలు సమాజానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి ఇచ్చిన సమాధానాలు వంటి అంశాలను విద్యార్థులు గమనించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం విపక్షాల బాధ్యత . సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సభను సమర్థంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ, దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా? అనే విధంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. దేశంలో విద్య, వ్యవసాయ రంగాల్లో నెహ్రూ విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. దాంతో, ప్రతి వారికీ చదువుకునే అవకాశం దక్కిందని, ఆయన వల్లే సమాజంలో ఇవాళ ఇన్ని అవకాశాలు వచ్చాయని చెప్పారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా, మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని చెప్పారు.
Updated Date - Nov 15 , 2024 | 03:41 AM