Harish Rao: రాజీనామా లేఖతో రేవంత్ రాలేదేం?
ABN, Publish Date - Apr 28 , 2024 | 05:45 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేసుడు కాదు, ఆరు గ్యారెంటీలను టచ్ చేసి ప్రజలకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
స్పీకర్ ఫార్మాట్‌లోనే నా రాజీనామా : హరీశ్
సిద్దిపేట/కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేసుడు కాదు, ఆరు గ్యారెంటీలను టచ్ చేసి ప్రజలకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట, కరీంనగర్‌లలో ఆయన మాట్లాడారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను రేవంత్ రెడ్డి అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని చెప్పారు. రాజీనామా లేఖతో తాను గన్‌పార్కు వద్దకు వెళ్తే, అక్కడకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు.
సరైన పద్ధతిలోనే స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా పత్రం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కొత్త జిల్లాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఇందులో మొదటగా సిద్దిపేట జిల్లాను తొలగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని, జిల్లాల రద్దుపై కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Updated Date - Apr 28 , 2024 | 06:48 AM