CM Revanth Reddy: మోదీ వచ్చాక దేశంలో భయానక పరిస్థితులు.. సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Feb 28 , 2024 | 10:29 PM
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ (Narendra Modi), రాష్ట్రంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ (Narendra Modi), రాష్ట్రంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అల్లర్లు, ఘర్షణలు జరిగితే పాలకులు అణచివేసేవారని.. కానీ పాలకులుగా ఉన్నవారే ఘర్షణలకు కారణమవుతున్నారంటూ మణిపూర్ (Manipur Violence), గుజరాత్ (Gujarat) ఘటనల్ని ఆయన ఉదహరించారు. ఇది దేశ శ్రేయస్సుకు మంచిది కాదని.. అందరూ పరమత సహనం పాటించాలని సూచించారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) కావాలనుకుంటే.. యూపీఏ (UPA) పదేళ్ల కాలంలోనే ప్రధానమంత్రి అయ్యేవారని, కానీ ఏనాడూ ఆయన పదవిని ప్రేమించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను ప్రేమించడం, ప్రజలందరిని కలిపి ఉంచడమే ఆయన లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టారని.. ఆ తర్వాత మణిపూర్ నుంచి గుజరాత్‌కు రెండో విడత యాత్ర (Bharat Jodo Nyay Yatra) ప్రారంభించారని తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌కు ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి వెళ్లలేదని.. రాహుల్ గాంధీ వెళ్లడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి ఘర్షణలను నిరోధించాయని చెప్పారు. తెలంగాణలో లౌకిక ప్రభుత్వం ఏర్పడిందని, కేంద్రంలోనూ లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సహకరించాలని.. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ స్థాయి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఔచిత్యం లేదని.. ప్రాంతీయ పార్టీలు గెలుచుకునే సీట్లన్ని నరేంద్ర మోదీకి ఉపయోగపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ 2014లో 11, 2019లో 9 ఎంపీ సీట్లు గెలిచారని.. నరేంద్ర మోదీ తెచ్చిన 370 రద్దు (Article 370), జీఎస్టీ (GST), నోట్ల ఉపసంహరణ (Demonetization), రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి దశలోనూ కేసీఆర్ మోదీకి మద్దతుగా నిలిచారన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వొద్దన్నారు. జాతీయ స్థాయిలో లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.