ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మోదీజీ.. మీవన్నీ అపోహలు, అవాస్తవాలే

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:02 AM

‘‘అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే దేశంలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా రుణ మాఫీ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో అమలు చేశాం. రైతును రాజును చేశాం.

  • ఎవరూ చేయనట్లు రైతుల్ని రుణ విముక్తుల్ని చేశాం

  • 25 రోజుల్లోనే రూ.18 వేల కోట్లు జమ చేశాం

  • 22,22,365 మంది రైతులకు ఇప్పుడు రుణాల్లేవ్‌

  • అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే

  • రూ.10 లక్షల వైద్యం.. మహిళలకు ఉచిత బస్సు

  • ఉచిత విద్యుత్తు, గ్యాస్‌ సిలిండర్లతో వారు హ్యాపీ

  • 11 నెలల్లోనే 50 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ

  • మెస్‌, కాస్మెటిక్‌ చార్జీలను 40ు పైగా పెంచాం

  • మా హయాంలో ఇంచు చెరువు కూడా కబ్జా కాలే

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే దేశంలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా రుణ మాఫీ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో అమలు చేశాం. రైతును రాజును చేశాం. రాష్ట్రంలో 22,22,365 మంది రైతులు ఇప్పుడు రుణ విముక్తులయ్యారు. రూ.2 లక్షల వరకూ వారి పేరిట ఉన్న అన్ని రుణాలనూ మాఫీ చేశాం. కేవలం 25 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లకుపైగా జమ చేశాం’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. తెలంగాణ, తన సర్కారుకు సంబంధించి ఆయన అపోహలు, అవాస్తవాలతో ప్రకటన చేశారని తప్పుబట్టారు. గత డిసెంబరు 7న కాంగ్రెస్‌ అధికారం చేపట్టగానే, పదేళ్ల బీఆర్‌ఎస్‌ చీకటి పాలన నుంచి విముక్తి కలిగిందని రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నెలకొన్న నిరాశా నిస్పృహలు, చీకటిని తమ 11 నెలల పాలనలో పారదోలామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయించే సూర్యుడిలా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు.


గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానికి రేవంత్‌ ట్వీట్‌ చేశారు. ఆ వివరాలు.. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అనే రెండు హామీలను అమలు చేశాం. గత 11 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా, వారికి రూ.3,433.36 కోట్లు ఆదా అయ్యాయి. మహిళలకు ఉచిత విద్యుత్తు అందుతోంది. 200 యూనిట్ల వరకూ ఇళ్లకు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. అంతేనా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల ధరాభారంతో మహిళలు సతమతమవుతుంటే.. కాంగ్రెస్‌ పాలిత తెలంగాణలో కేవలం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి వస్తోంది. ఇప్పటి వరకూ 1.31 కోట్లకుపైగా సిలిండర్లను వారికి అందించాం. 42,90,246 మంది లబ్ధిదారులు నవ్వుతూ కిచెన్‌లోకి వెళ్లారు. అందుకే, వారంతా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు.


పరీక్షల నిర్వహణ, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో పదేళ్ల వైఫల్యం తర్వాత.. అతి పెద్ద రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రభుత్వం చేపట్టింది. గడిచిన 11 నెలల్లో మా ప్రభుత్వం 50 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో నియామకాలు చేపట్టలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యార్థులను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్‌, కాస్మెటిక్‌ చార్జీలను 40 శాతానికి పైగా పెంచాం. అందుకే, పదేళ్ల తర్వాత ఇప్పుడు వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని మేం ప్రక్షాళన చేసి.. పునరుజ్జీవింపజేస్తున్నాం. నాలాలు, చెరువులను పరిరక్షిస్తున్నాం. గత పదేళ్లుగా ఆక్రమించిన, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన జల వనరులను మేం పరిరక్షిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచు చెరువు భూమి కూడా కబ్జా కాలేదు. అంతేనా.. మేం ఫ్యూచర్‌ సిటీని సృష్టిస్తున్నాం. దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమవుతోంది. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటుచేస్తున్నాం.

Updated Date - Nov 03 , 2024 | 04:02 AM