ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే!

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:19 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్య క్రమంలో ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

  • లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం

  • పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం

  • ఆదివాసీ, ఐటీడీఏల్లో ప్రత్యేక కోటా

  • దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు పెద్దపీట.. సమీక్షలో రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్య క్రమంలో ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ఇళ్లలో లబ్ధిదారులెవరైనా అదనపు గదులు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరిస్తే.. అందుకు అవకాశం కల్పించాలన్నారు. ఇక రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ప్రత్యేక కోటాను అమలు చేయాలని నిర్దేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిదశలో సొంత స్థలాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పథకం అమలులో గ్రామ కార్యదర్శితోపాటు మండల స్థాయు అధికారులను బాధ్యులను చేయాలని, అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అన్నారు. పథకం కోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో శాఖాపరంగా కూడా ఎలాంటి పొరపాట్లకు తావుండొద్దన్నారు. పథకాన్ని సమర్థంగా కొనసాగించేందుకు వీలుగా గృహనిర్మాణ శాఖ బలోపేతం కావాలని, అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని అన్నారు.


  • ఇళ్ల కోసం ఫైలట్‌ యాప్‌..

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌, మెదక్‌తోపాటు మరో రెండు జిల్లాల్లోని ఒక గ్రామం, మునిసిపాలిటీ పరిధిలోని ఒక వార్డులో యాప్‌ను పైలట్‌ ప్రాజెక్టు కింద పరిశీలిస్తున్నారు. యాప్‌లో పొందు పరచాల్సిన వివరాలను పూర్తిస్థాయిలో తీసుకుంటుందా, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు తలెత్తుతాయా, ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను యాప్‌లో నమోదుచేసేందుకు ఎంత సమయం పడుతుంది వంటి ,అన్ని అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు పరిశీలనలో యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే.. వాటన్నింటినీ పరిశీలించి, పథకం అమలుకు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాసయోజన పథకంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం కూడా తమ పథకం అమలు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో నమోదు చేసిన వివరాలను, కేంద్రం సూచించే యాప్‌లోనూ పొందుపరచాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ యాప్‌ను.. కేంద్రం సూచించే యాప్‌నకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలా అనుసంధానిస్తేనే దరఖాస్తుదారులకు పథకం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబరు 1 నుంచి 9వరకు నిర్వహించబోయే ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో ఏదో ఒకరోజు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4.50 లక్షల ఇళ్లను అర్హులకు అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 30 , 2024 | 03:19 AM