CM Revanth Reddy: అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్
ABN, Publish Date - Aug 26 , 2024 | 03:42 AM
ప్రధాని నరేంద్రమోదీ 2036లో భారత్‌లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు రెడీ
మారథాన్ 10కె రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్
క్రీడా సదుపాయాలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు
వచ్చే ఏడాది యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ: రేవంత్
హైదరాబాద్ సిటీ/గచ్చిబౌలి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ 2036లో భారత్‌లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే ఆ అవకాశం తెలంగాణకు ఇవ్వాల్సిందిగా తాను ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు కోరానని చెప్పారు. తమకు అవకాశం ఇస్తే హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. నిర్వహణకు కావాల్సిన అంతర్జాతీయ వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకుంటామని అన్నారు.
ఆదివారం హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ (హెచ్‌ఆర్‌ఎ్‌స), ఎన్‌ఎండీసీ హైదరాబాద్ నిర్వహించిన ఫుల్, ఆఫ్ మారథాన్, 10కె రన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వచ్చే ఏడాదిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
2000 సంవత్సరంలో గచ్చిబౌలి స్టేడియంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ గేమ్స్‌తోపాటు చాలా ఈవెంట్లను నిర్వహించారని గుర్తు చేశారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఈ దేశానికే క్రీడల్లో ఆదర్శంగా నిలవాల్సిన హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఒక్కొక్క మెట్టు దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
గచ్చిబౌలి స్టేడియం క్రీడా కార్యక్రమాలకే..
రాష్ట్రంలోని యువతను క్రీడలవైపు మళ్లించాలని, క్రీడల పట్ల వారిలో ఆసక్తిని పెంచాలని తమ ప్రభుత్వం సంపూర్ణంగా ఆలోచిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ విలేజ్‌ను 25 ఏళ్ల క్రితం దూరదృష్టితో నిర్మించారని, ఈ స్పోర్ట్స్ విలేజ్‌ను వందశాతం మళ్లీ క్రీడా కార్యక్రమాలకే వినియోగించేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో మనం అంత గొప్పగా రాణించలేకపోయామని, 2028లో జరిగే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచే అత్యధికంగా పతకాలు సాధించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
‘‘గతవారం దక్షిణ కొరియాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించాను. అక్కడ ఆర్చరీలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన అమ్మాయిని కలిశాను. యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి తెలంగాణలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు వారి సహకారం అవసరమని భావించి.. ఆ వర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. నిన్న ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రిని కలిసి.. రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్‌ను గానీ, జాతీయ క్రీడలను గానీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని కోరాను. అతి త్వరలో దేశంలో జరిగే ఏ క్రీడలైనా, క్రికెట్‌తో సహా అన్నింటినీ తెలంగాణ నుంచే, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని ఆలోచిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎన్‌ఎండీసీ ఈడీ జైపాల్‌రెడ్డి, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు రాజేష్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 26 , 2024 | 03:42 AM