Education: విద్యలో నైపుణ్యాలకు పెద్దపీట!
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:26 AM
నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. విద్యారంగంలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విప్లవాత్మకమైన చర్యలను చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచ అవసరాలకు పనికొచ్చేలా విద్యార్థులకు సాంకేతిక విద్య
స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు.. నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణలు
పూర్తిగా బోధనపైనే దృష్టిపెట్టేలా టీచర్ల సమస్యలను పరిష్కరించాం
11,062 టీచర్ పోస్టుల భర్తీ చేశాం..
సీంఎంఆర్‌ఎఫ్ సాయం రూ.830 కోట్లు.. ఒక్క ఏడాదిలోనే... ఇదో రికార్డు
ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. విద్యారంగంలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విప్లవాత్మకమైన చర్యలను చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ అవసరాలను తీర్చే నైపుణ్యాలను విద్యార్థులు ఒడిసిపట్టేలా సాంకేతిక విద్యకు కొత్త మెరుగులు దిద్దుతోందని ప్రకటనలో పేర్కొంది. ఉపాధ్యాయులు పూర్తిగా బోధనపైనే దృష్టిపెట్టేలా వారి సమస్యలను పరిష్కరించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యా శాఖకు రూ.21,292 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, ఇది నిరుటి బడ్జెట్ కన్నా రూ.2,119 కోట్లు ఎక్కువ అని పేర్కొంది.. పాఠశాలల సమస్యలను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలు తెరిచే నాటికి బల్లలు, కుర్చీలు, తలుపుల మరమ్మతులు.. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, తరగతి గదుల విద్యుదీకరణ, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు జరిగిందని వెల్లడించింది. ఇందుకు రూ.1,100 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తుచేశారు. ఏళ్ల తరబడి పాఠశాలల్లో పారిశుద్థ్య నిర్వహణను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, బడుల్లో పారిశుదఽ్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు.. మొక్కల సంరక్షణకు సింగరేణి కంపెనీ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కింద రూ.136 కోట్లు కేటాయించినట్లు సీఎంవో వివరించింది.
రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని, సుమారు 21,419 మందికి పదోన్నతులు లభించాయని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను, 2,757 మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలను చేసినట్టు వెల్లడించింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసినట్లు పేర్కొంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తున్నామని, అన్ని మండలాలకు మండల విద్యాధికారులను నియమించినట్లు వెల్లడించింది. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టినట్టు తెలిపింది. ఆధునిక ప్రపంచ అవసరాలు, ప్రపంచంలోని పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ బిడ్డలకు నైపుణ్య విద్యను అందించాలనే సంకల్పంతో పురాతన కోర్సులు, సర్టిఫికెట్లకే పరిమితమైన 65 ఐటీఐలను రూ.2,106 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఐటీసీ) మార్చినట్లు వెల్లడించింది. అకడమిక్ కోర్సులు.. పరిశ్రమల అవసరాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిట్లు వివరించింది. యువత ఆధునిక నైపుణ్యాలు నేర్చుకొని ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఈ స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పింది. పాఠశాలల్లోకి డ్రగ్స్ ప్రవేశించకుండా ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
సీంఎంఆర్‌ఎఫ్ సాయం రూ.830 కోట్లు!
ముఖ్యమంత్రి సహాయనిఽధి అమలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డును నెలకొల్పింది. ఏడాదిలోనే సీఎంఆర్‌ఎఫ్ కింద దాదాపు రూ.830 కోట్లను విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో సీఎం సహాయనిధి కింద రూ.2400 కోట్ల సాయాన్నే అందించింది. మూగ, చెవుడు సమస్యలతో జన్మించే పిల్లలకు 6 ఏళ్లలోపు శస్త్రచికిత్సలు చేయిస్తే వారికి మాటలు రావడంతో పాటు చెవులు వినపడే అవకాశముంటుంది. ఈ విషయాన్ని తొలి సమీక్షలోనే వైద్యారోగ్య శాఖ.. సీఎం దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన సీఎం ఎంత ఖర్చయినా అలాంటి పిల్లలకు చికిత్సలు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్‌వోసీలను ప్రభుత్వం మంజూరు చేసింది.
Updated Date - Dec 02 , 2024 | 03:26 AM