Telangana: తెలంగాణలో మరోసారి భూకంపం..
ABN, Publish Date - Dec 07 , 2024 | 05:10 PM
తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని దాసరిపల్లి కేంద్రంగా రిక్టారు స్కేలుపై 3.0గా భూకంపం నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూమి లోపల సుమారు 10 కిలో మీటర్ల లోతున ఈ భూకంపం వచ్చినట్టు వెల్లడించారు.
Telangana: తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. నేడు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూమి లోపల సుమారు 10 కిలో మీటర్ల లోతున భూకంపం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్టు తెలిపారు. ఒక్కసారిగా భూప్రకంపనలతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి వెంటనే బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక జనాలు ఆందోళన చెందారు.
అయితే, సరిగ్గా మూడు రోజుల క్రితం డిసెంబర్ 04న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారం, మారేడుపాక, బోర్లగూడెం మధ్య ఉన్న ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సిటీలోనూ భూప్రకంపనలు నమోదయ్యాయి. భూమి లోపల 40 కిలో మీటర్ల లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. వరుస భూప్రకంపనలతో ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నారు.
Updated Date - Dec 07 , 2024 | 05:10 PM