Khammam: దంపతుల దారుణ హత్య
ABN, Publish Date - Nov 28 , 2024 | 05:12 AM
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులు మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారిద్దరి కంట్లో కారం కొట్టి చంపారు. యర్రా వెంకటరమణ (62), కృష్ణకుమారి (60) దంపతులకు కొత్త బస్టాండ్ సమీపంలోని సొంత ఇంట్లో ఉంటున్నారు.
ఇల్లు కిరాయి కోసం వచ్చి కిరాతకం
నగలు, నగదు ముట్టుకోని వైనం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఘటన
నేలకొండపల్లి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులు మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారిద్దరి కంట్లో కారం కొట్టి చంపారు. యర్రా వెంకటరమణ (62), కృష్ణకుమారి (60) దంపతులకు కొత్త బస్టాండ్ సమీపంలోని సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఖాళీగా ఉన్న వాటా అద్దెకు కావాలని ముగ్గురు వ్యక్తులు పది రోజుల క్రితం వచ్చి వెళ్లారు. తర్వాత ఇల్లు తమకు నచ్చిందని కొంత నగదు అడ్వాన్స్‌గా ఇచ్చారు. సోమవారం రాత్రి సదరు వ్యక్తులు వెంకటరమణ ఇంట్లోనే భోజనం చేసి వెళ్లారు. మంగళవారం రాత్రి కూడా వచ్చిన ఆ వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వెంకటరమణ దంపతులపై దాడి చేసి.. కళ్లల్లో కారం కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆనవాళ్లు దొరక్కుండా ఘటనా స్థలంతో పాటు ఇంటి చుట్టూ కారం చల్లి, ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయారు.
జగ్గయ్యపేటలో ఉంటున్న వెంకటరమణ దంపతుల కుమార్తె అనురాధ బుధవారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. ఎంతకీ బదులు లేదు. దీంతో ఇంట్లో మరో వాటాలో అద్దెకు ఉండే వారికి ఫోన్ చేసింది. వారు గ్రామంలోనే ఉంటున్న వెంకటరమణ సోదరుడు రమే్‌షకు సమాచారం అందించారు. అతడు వచ్చి తాళం పగులగొట్టి చూడగా ఈ దారుణం బయటపడింది. దంపతుల హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకులు నగలను కానీ నగదును కానీ ఎత్తుకెళ్లిన ఆనవాళ్లు లేవు. నగల మూట ఇంట్లోనే ఉంది. వాటిని పోలీసులు పరీక్షించగా రోల్డ్‌గోల్డ్ అని తేలాయి. నగల మూటను ముట్టుకోని హంతకులకు అవి రోల్డ్‌గోల్డ్ అని తెలియకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాగా తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడ్డారా? లేక సుపారీ గ్యాంగ్‌ను ఉపయోగించారా?అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Updated Date - Nov 28 , 2024 | 05:12 AM