Election Commission: వీసీల నియామకానికి ఈసీ ఓకే..
ABN, Publish Date - May 16 , 2024 | 02:46 AM
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను (వీసీలు) నియమించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, అంబేడ్కర్, జేఎన్‌టీయూహెచ్, జేఎన్‌ఏఎ్‌ఫఏ యూనివర్సిటీల వీసీల పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే.
సెర్చ్ కమిటీల ఏర్పాటుకు
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
వారం రోజుల్లో ఉపకులపతుల
నియామక ప్రక్రియ పూర్తి
21వ తేదీతో పూర్తి కానున్న
ప్రస్తుత వీసీల పదవీ కాలం
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను (వీసీలు) నియమించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, అంబేడ్కర్, జేఎన్‌టీయూహెచ్, జేఎన్‌ఏఎ్‌ఫఏ యూనివర్సిటీల వీసీల పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. అప్పటికల్లాకొత్త వీసీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. ఈమేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది.
ఇంతలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. మే 13న పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు వీసీల నియామకానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో పది వర్సిటీలకూ వేర్వేరు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో యూజీసీ, ఆయా వర్సిటీల నుంచి ఒక్కో ప్రతినిధి, సీఎస్ సభ్యులుగా ఉంటారు. అలాగే.. విద్యా శాఖ కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సెర్చ్ కమిటీలు సమావేశమై తదుపరి కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక.. ట్రిపుల్ ఐటీ బాసరతోపాటు కొత్తగా ఏర్పాటైన మహిళా వర్సిటీలకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చిన తర్వాతే వీసీలను నియమించాల్సి ఉంది. కాబట్టి ఆ రెండు వర్సిటీలకూ పాత వారే కొనసాగే అవకాశం ఉంది.
312 దరఖాస్తులు..
పది విశ్వవిద్యాలయాల వీసీ పోస్టులకు మొత్తం 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని వర్సిటీలకూ కలిపి 1,382 దరఖాస్తులు వచ్చాయి. సెర్చ్ కమిటీలు వీటిని పరిశీలించనున్నాయి. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో వీసీల నియామకంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా దృష్టిలో ఉంచుకోనున్నారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి పూర్తి వివరాలపై ఇప్పటికే నిఘా అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా దరఖాస్తులను వడపోయనున్నారు. అనంతరం సెర్చ్ కమిటీ చేసే సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్సిటీలకు వీసీల పేర్లను ఆమోదించనుంది. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించనున్నారు. గవర్నర్ ఆమోదంతో కొత్త వీసీల నియామక ప్రక్రియ పూర్తవుతుంది.
ఏ వర్సిటీకి ఎన్ని దరఖాస్తులు?
యూనివర్సిటీ దరఖాస్తులు
ఉస్మానియా 193
కాకతీయ 149
పాలమూరు 159
మహత్మగాంధీ 157
శాతవాహన 158
తెలంగాణ 135
పొట్టి శ్రీరాములు 66
అంబేడ్కర్ 208
జేఎన్‌టీయూహెచ్ 106
జేఎన్‌ఏఎ్‌ఫఏ 51
మొత్తం 1,382
Updated Date - May 16 , 2024 | 02:46 AM