E-Race Case: ఈ-రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌ను వదిలేలా లేరుగా..
ABN, Publish Date - Dec 20 , 2024 | 08:23 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ కేసులో కాస్త ఊరట లభించిందని భావించగానే.. ఈడీ రూపంలో మరో షాక్ తగిలింది.
హైదరాబాద్, డిసెంబర్ 20: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ కేసులో కాస్త ఊరట లభించిందని భావించగానే.. ఈడీ రూపంలో మరో షాక్ తగిలింది. ఏసీబీ నమోదు చేసిన కేసు నుంచి ఊరటనిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చి గంటలు గడవకముందే.. మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్. కేటీఆర్‌పై కేసు నమోదైంది. పీఎంఎల్‌ఏ, మనీలాండరింగ్ కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఈ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. దీని ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసి విచారణకు ఉపక్రమించింది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో అవినీతి జరిగిందంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కేసు పెట్టింది. ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా చేర్చగా.. అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చింది. వీరిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1),(ఏ) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120 బి ప్రకారం కేసు నమోదు చేశారు.
సాయంత్రమే ఊరట.. అంతలోనే ట్విస్ట్..
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించింది హైకోర్టు ధర్మాసనం. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత.. డిసెంబర్ 30వ తేదీ వరకు ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని తీర్పునిచ్చింది. ఈలోగా ఈ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.
Updated Date - Dec 20 , 2024 | 08:51 PM