Podu Land: పోడు భూమిని తీసుకుంటే ఉరేసుకుంటా!
ABN, Publish Date - Jun 13 , 2024 | 03:24 AM
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ రైతు కుటుంబానికి రెండెకరాల పోడు భూమే జీవనాధారం. ఆరేళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుబండి లాగిస్తున్నాడు. ఇటీవల ఆ భూమి తమ పరిధిలోకి వస్తుందంటూ అటవీ అధికారులు చెప్పడంతో.. ఆ రైతు గుండె ఆగినంతపనైంది. తన కుటుంబానికి దిక్కుగా ఉన్న ఆ భూమిని తీసుకుంటే.. తాను బతకలేనని, ఉరేసుకుంటానని చెప్పిన ఆ రైతు అన్నంత పని చేశాడు.
అధికారులతో చెప్పిన పోడు రైతు.. అన్నంత పనీ చేశాడు
తన భూమి పోతోందన్న బాధతో రైతు బలవన్మరణం
మిర్యాలగూడ, జూన్ 12: అతడో పేద రైతు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ రైతు కుటుంబానికి రెండెకరాల పోడు భూమే జీవనాధారం. ఆరేళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుబండి లాగిస్తున్నాడు. ఇటీవల ఆ భూమి తమ పరిధిలోకి వస్తుందంటూ అటవీ అధికారులు చెప్పడంతో.. ఆ రైతు గుండె ఆగినంతపనైంది. తన కుటుంబానికి దిక్కుగా ఉన్న ఆ భూమిని తీసుకుంటే.. తాను బతకలేనని, ఉరేసుకుంటానని చెప్పిన ఆ రైతు అన్నంత పని చేశాడు. బుధవారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బంగారికుంటతండాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంగారికుంట తండా మొల్కచర్ల రెవెన్యూ శివారులోని 20 ఎకరాల్లో 15 కుటుంబాలు ఆరేళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. ఇదే తండాకు చెందిన కుర్ర కస్న (58) రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు.
అటవీశాఖ అధికారులు ఇటీవల ఆ ప్రాంతంలోని పోడు భూములను తమ శాఖకు చెందిన భూములుగా గుర్తించి వాటిలో మొక్కలు నాటేందుకు యత్నిస్తున్నారు. మంగళవారం అటవీ అధికారులు రాగా.. తన భూమి మీదకు వస్తే తాను ఉరి వేసుకుంటానని వారితో కస్న అన్నాడు. దీంతో వెనుదిరిగిన అటవీశాఖ సిబ్బంది బుధవారం ఉదయం పోలీసుల సహాయంతో మొల్కచర్ల రెవెన్యూ శివారు ప్రాంతానికి చేరుకున్నారు. ఎక్స్‌కవేటర్‌తో కస్న పక్క రైతు పోడు భూమిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో తన భూమిలో కూడా మొక్కలు నాటుతారని, తాను జీవనాధారం కోల్పోతానని ఆవేదనతో ఉన్న కస్న కొంత దూరంలో ఉన్న చెట్టు కొమ్మకు తాడుతో ఉరి వేసుకున్నాడు. కస్న మృతదేహాన్ని మిర్యాలగూడకు తీసుకువెళ్లిన బంధువులు.. అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు యత్నించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
Updated Date - Jun 13 , 2024 | 03:24 AM