బియ్యం సేకరణ బంద్!
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:10 AM
భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) రాష్ట్రంలో బియ్యం సేకరణను నిలిపివేసింది. గత ఏడాదికి సంబంధించిన ఈ సేకరణను ఆపేసింది.
రాష్ట్రంలో సేకరణను నిలిపివేసిన ఎఫ్‌సీఐ.. 2023-24 రెండు సీజన్ల బకాయిలు 17 లక్షల టన్నులు
ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే రూ.6 వేల కోట్ల భారం
ఈ నెల 15 నుంచి నిలిచిన బియ్యం డెలివరీ, మిల్లింగ్
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) రాష్ట్రంలో బియ్యం సేకరణను నిలిపివేసింది. గత ఏడాదికి సంబంధించిన ఈ సేకరణను ఆపేసింది. 2023-24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించడానికి కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 15తోనే ముగిసిపోయింది. దీంతో రాష్ట్రం నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయింది. రెండు సీజన్లలో కలిపి 17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద బకాయి ఉంది. మిల్లర్లు సకాలంలో మర ఆడించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పుడు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై రూ.6 వేల కోట్ల భారం పడే పరిస్థితి దాపురించింది. సాధారణంగా ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మధ్య ఒప్పందం ప్రకారం.. ధాన్యం అప్పగించిన 15 రోజుల్లోనే రైస్‌మిల్లర్లు మర ఆడించి, బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ, జీవోలో మాత్రం మూడు నెలల్లో బియ్యం అప్పగించాలనే నిబంధన పెట్టారు. మిల్లర్లు మాత్రం ఏడాదైనా బియ్యం అప్పగించడం లేదు. రోజూ మిల్లర్లు 25-30 వేల టన్నుల బియ్యం డెలివరీ ఇస్తే.. ఎఫ్‌సీఐ నుంచి రూ.90-100 కోట్ల బిల్లు వచ్చేది. ఇప్పుడు అది నిలిచిపోయింది. 2023-24 వానాకాలం సీజన్లో 47.34 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి, మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 32 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఏడాదిలో 29 లక్షల టన్నుల బియ్యం అప్పగించారు. ఇంకా 3 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే మిగిలిపోయాయి. యాసంగికి సంబంఽధించి 48 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. 33 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. కానీ, 19లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 14లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. మొత్తం కలిపి 17 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉంది. వీటి విలువ అక్షరాలా రూ.6వేల కోట్లు కావడం గమనార్హం.
రాష్ట్రంపై రూ.6 వేల కోట్ల భారం
కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చి.. మిగిలిన బియ్యం తీసుకోకపోతే రాష్ట్రంపై రూ.6వేల కోట్ల ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రూ.45వేల కోట్ల అప్పుల్లో ఉంది. ఇప్పుడీ రూ.6 వేల కోట్లు తోడైతే మళ్లీ రూ.50వేల కోట్లు దాటనుంది. వాస్తవానికి సీఎంఆర్ పురోగతిపై గతంలో (ఉమ్మడి రాష్ట్రంలో) జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సమీక్షలు నిర్వహించేవారు. అయితే గత పదేళ్లలో ఈ వ్యవస్థ కుంటుపడింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసి చోద్యం చూస్తుండడంతో ఎక్కడికక్కడ బకాయిలు పేరుకుపోయాయి. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. మిల్లర్ల నుంచి ఆ బకాయిలు వసూలు చేయించి, టెండరు ఏజెన్సీలకు ముట్టజెప్పడానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. టెండరు ధాన్యం అప్పగించని రైస్‌మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్టులు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే తరహాలో సీఎంఆర్‌పై ఎందుక దృష్టి పెట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Updated Date - Dec 25 , 2024 | 03:10 AM