ఫై‘నాన్సెస్’ దందా
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:31 AM
ప్రెవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. కొందరు విచ్చలవిడిగా దందాను కొనసాగుతూ అప్పులు తీసుకున్న వారి రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అనేక మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు
పెట్రేగిపోతున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారులు
అధిక మిత్తి వసూలు చేస్తూ వేధింపులు
బెంబేలెత్తిపోతున్న సామాన్య జనం
అధిక చెల్లింపులతో అవస్థలు
భూపాలపల్లిటౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రెవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. కొందరు విచ్చలవిడిగా దందాను కొనసాగుతూ అప్పులు తీసుకున్న వారి రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అనేక మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గ్రామాల్లో బ్రోకర్లను నియమించుకొని అడ్డూ అదుపు లేకుండా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. వడ్డీలకు చక్ర వడ్డీలు విధిస్తూ సామాన్యుల నడ్డి విరిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, కాకతీయ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) ఉండటంతో పారిశ్రామికంగానే కాకుండా వ్యాపారపరంగా పురోగతి సాధిస్తోంది.. ఈ నేపథ్యంలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. కార్మిక కుటుంబాలు ఇక్కడ స్థిరపడటంతోపాటు వ్యాపారులు నివాసాలను ఏర్పర్చుకున్నారు. ఇదే క్రమంలో అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలూ ఇక్కడ అడుగుపెట్టాయి. జిల్లాలో 20 నుంచి 30 వరకు ఈ సంస్థలు ఏర్పడ్డాయి. ఒక్క భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే సుమారు 12 కంపెనీలు ఉన్నాయి.
నిబంధనలు అతిక్రమించి..
జిల్లాలో ఏర్పడిన ఫైనాన్స్ కంపెనీలు అన్నింటికీ అన్ని రకాల అనుమతులతోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. వీటితోపాటు అనధికారంగా వందలాది మంది వడ్డీ వ్యాపారులు వెలిశారు. ఫైనాన్స్ కంపెనీల్లో కొన్ని నిబంఽధనలను అతిక్రమించి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరితోపాటు అనధికార వ్యాపారులు కూడా ఇదే తరహాలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని వారి జీవితాలను మరింత దుర్భరంగా మార్చుతు న్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ప్రము ఖంగా గిరిగిరి పేరుతో నడిపించేది సామా న్యులకు మరింత కఠినతరంగా ఉంది. దీని బారిన పడిన వారు ఆర్థికంగా కోలుకోని పరిస్థితి నెలకొంది. అప్పులు తీసుకున్న వారు రోజురోజుకూ అగాధంలో పడటం తప్ప బయట పడే మార్గం ఉండదు.
అధిక వసూళ్లకు అనేక సాకులు
జిల్లాలోని ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా మార్టిగేజ్ (ఇల్లు, ఖాళీ స్థలం తాకట్టు పెట్టుకో వడం) రుణాలు ఇస్తున్నాయని తెలుస్తోంది. వీటితోపాటు బంగారు ఆభరణాలపై కూడా కొన్ని సంస్థలు అప్పులు ఇస్తున్నాయి. అయితే... రుణాలు తీసుకొనే సమయంలో నిబంధనలకు లోబడి వడ్డీ రేటు చూపించినా అనేక సాకులు చూపుతూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వినియోగదారులకు అర్థం కాని రీతిలో గోప్యంగా కూడా అధిక వడ్డీలు, ఇతర చార్జీలు దండుకుం టున్నట్టు తెలుస్తోంది. అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా లేట్ అయితే ఫైన్ కూడా వసూలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూపాలపల్లికి చెందిన ఓ వ్యక్తి మొదటగా తీసుకున్న రుణానికి 17శాతం వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. కానీ చివరకు 23శాతం వరకు వసూలు చేసినట్లు అతను లెక్కలు చూసుకొని అవాక్కయ్యాడు. ఇదేమిటని అడిగితే నిబంధనలు చదవలేదా? అని ఫైనాన్స్ కంపెనీ నిర్వాహ కులు సమాధానం ఇచ్చారని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే గత నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి ఓ సంస్థ నుంచి మార్ట్‌గేజ్ రుణం పొందాడు. అయితే ఆ సంస్థ అనతికాలంలోనే బోర్డు తిప్పేసి మరో కంపెనీకి దాన్ని కట్టబెట్టింది. అయినప్పటికీ అతడు తాను తీసుకున్న రుణాన్ని తీర్చేశాడు. కానీ అతడి డాక్యుమెంట్లు మాత్రం ఎక్కడున్నాయో తెలియడం లేదు. పాత సంస్థ యజమానులు ఎక్కడ ఉన్నారో కూడా రుణగ్రహీతకు తెలియదు. కొత్త సంస్థలో అడిగితే తమ వద్ద అవి లేవని చేతులు ఎత్తేసింది.
అవగాహనే ప్రధానం
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి రకరకాల ఆంక్షలు పెట్టడం, రుణం మంజూరు చేయ డంలో తీవ్ర జాప్యం చేయడంతో విసిగివేసారి పోతున్న వినియోగదారులు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోందని తెలుస్తోంది. అయితే.. అప్పులు తీసుకున్నప్పుడు ఆ సంస్థకు సంబంఽ దించిన నిబంధనలు, వడ్డీ రేట్లు ముందే తెలుసు కోవాలని అంటున్నారు ఆర్థిక, న్యాయ నిపుణులు. బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని సూచి స్తున్నారు.
అగ్రిమెంటు ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది
- ఎన్.విష్ణువర్ధన్‌రావు, న్యాయవాది
ఏ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ అయినా నిబంధనలు అతిక్రమించొద్దు. రుణ గ్రస్థులు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే న్యాయ సహాయం పొందొచ్చు. అయితే.. అగ్రిమెంటు ప్రకారం వినియోగదారులు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పితే అపరాధ రుసుం వసూలు చేసే అధికారం ఫైనాన్స్ కంపెనీలకు ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి, ఒకేసారి చెల్లించడానికి సిద్ధమైతే ఆ సంస్థ నిర్వాహకులకు ఈ విషయాన్ని వెల్లడించాలి. అంగీకరించకుంటే కోర్టును ఆశ్రయించి అసలును చెల్లించేలా వినియోగదారుడికి అవకాశం ఉంటుంది.
Updated Date - Dec 20 , 2024 | 12:31 AM