గోదావరి వరద ఉధృతి రేపటి నుంచి తగ్గుముఖం: విపత్తుల నిర్వహణ సంస్థ
ABN, Publish Date - Jul 29 , 2024 | 10:16 AM
గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 48.4 అడుగులుగా ఉంది.
అమరావతి: గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 48.4 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16.09 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని కూర్మనాథ్ వెల్లడించారు. సహాయక చర్యల్లో 3 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం:1630.88 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర ఇన్ ఫ్లో 15,6780 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 15,6248 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం 97. 410 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్ ఫ్లో : 4,36,433 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 62,857 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 876.70 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 171.8625 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 15.70 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. 175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. 15.94 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు విడుదల కానుంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత గోదావరి నీటిమట్టం 44.90 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం వచ్చేసి 10,12,804 క్యూసెక్కుల కు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Updated Date - Jul 29 , 2024 | 10:16 AM