Ponguleti: ఇందిరమ్మ ఇళ్లు నెలాఖరులోగా..
ABN, Publish Date - Oct 20 , 2024 | 02:46 AM
రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 నుంచి 4 వేలు
గోషామహల్‌లో పట్టాల పంపిణీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెలాఖరు వరకు తొలివిడతలో నియోజకవర్గానికి 3500 నుంచి 4వేల వరకు ఇళ్లను కేటాయిస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 144 మంది పేదలకు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలోని రెండు పడకల గృహసముదాయంలో ఇళ్లను కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అర్హులైన పేదలకు పట్టాలు పంపిణీ చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ర్టానికి పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేయాలని ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హౌసింగ్ జాయింట్ సెక్రటరీని కోరామన్నారు. తాము ఎలాంటి భేషజాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమ గురించి కనీస ఆలోచన చేయలేదని మంత్రి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆగదని, పేదవాడి కన్నీరు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ నిర్వాసితులపై కపటప్రేమ ఒలకపోస్తున్నారని, యూట్యూబ్ చానళ్లలో యాక్షన్లు చేస్తున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు.
7.4 లక్షల కోట్లు అప్పుచేశారు: పొన్నం
తెలంగాణ ఏర్పాటైన సమయంలో తాము గళ్లా నిండా డబ్బులు ఉంచి ఇస్తే గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.7.40 లక్షల కోట్ల్ల అప్పు చేసిందని, రూ. 40 వేల కోట్ల బిల్లులు బకాయిల కింద చూపించిందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పేదలను మూసీ మురికి నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్ అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో గోషామహాల్, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు రాజాసింగ్, శ్రీగణేష్ పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 02:46 AM