Harish Rao: వ్యక్తులను టార్గెట్ చేసి వేధించడం ఏంటి?
ABN, Publish Date - Dec 25 , 2024 | 05:01 AM
వ్యక్తులను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికించి వేధించడం ఏంటి? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా? చట్టం నీకు, మీ పార్టీ నాయకులకు చుట్టమా.. రేవంత్ రెడ్డీ?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
అల్లు అర్జున్ కేసుపై సీఎంకు హరీశ్ ప్రశ్న
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘వ్యక్తులను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికించి వేధించడం ఏంటి? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా? చట్టం నీకు, మీ పార్టీ నాయకులకు చుట్టమా.. రేవంత్ రెడ్డీ?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరమని, అయితే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిని, నష్టం జరిగే అవకాశం ఉందని తెలుసుకోవాలని సూచించారు. సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవను మిగతా వారి విషయంలోనూ చూపాలని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నీ తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి, సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. ఇంతవరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేద’ని సీఎంను ప్రశ్నించారు. 80 మంది ఆటోడ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నా.. 450 మందికి పైగా రైతులు చనిపోయినా సీఎంలో చలనం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 50మందికి పైగా గురుకులాల విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలందరూ రేవంత్ రెడ్డితో ఫొటోలు దిగిన వాళ్లేనని పేర్కొన్నారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంపై దాడి చేయించిందీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. భౌతికదాడులతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయాలని, ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి లేదని, రాయలసీమ తరహా దాడులు, ఫ్యాక్షనిస్టు సంస్కృతిని తెచ్చిపెట్టిన రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కుప్పకూలుస్తున్నారన్నారు. ఈ చర్యను తెలంగాణ ప్రజలు హర్షించరని, దీనికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.
Updated Date - Dec 25 , 2024 | 05:01 AM