Harish Rao: ‘ఆశ’లపై నీళ్లు చల్లడం సిగ్గుచేటు
ABN, Publish Date - Dec 10 , 2024 | 03:19 AM
రాష్ట్రంలో దుర్మార్గ అరాచక పాలన సాగుతోందని, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
వారికి నిరసన తెలిపే హక్కు లేదా?
రేవంత్, అదానీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తామనే మా ఎమ్మెల్యేల అరెస్టు: హరీశ్
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో దుర్మార్గ అరాచక పాలన సాగుతోందని, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు ఏడాదిగా పోరాడుతున్నారని, ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలు చేయాలంటూ ఆశాలు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గమన్నారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతూ... మరోవైపు ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ‘‘ఎక్స్’’ వేదికగా పేర్కొన్నారు.
అంతకుముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అదానీ, రేవంత్‌ల చీకటి ఒప్పందాలు బయటపడతాయనే ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. కాగా, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచ్‌లు, ఆ సంఘం నాయకులను సొంత ఊర్లలోనే నిర్బంధించడం, ఎక్కడిక్కడ అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నించడమే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏడాదిగా మాజీ సర్పంచ్‌లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న సీఎం.. మాజీ సర్పంచ్‌ల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
Updated Date - Dec 10 , 2024 | 03:19 AM