Asifabad: వెంటిలేటర్‌పై విద్యార్థిని!
ABN, Publish Date - Nov 03 , 2024 | 04:45 AM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం మరో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత.. పాఠశాలలో అస్వస్థతకు గురైన శైలజ
మరో 14 మందికీ వాంతులు, విరేచనాలు
శైలజ సహా ముగ్గురి పరిస్థితి విషమం
వాంకిడి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం మరో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. శైలజ అనే విద్యార్థిని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ పాఠశాలలో అక్టోబరు 30 నుంచి విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికే 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై చికిత్స పొందగా.. ప్రస్తుతం వీరి సంఖ్య 60కి చేరింది.
శనివారం అస్వస్థతకు గురైన 15 మందిలో.. 12 మందికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శైలజ, పార్వతి, కోవ లక్ష్మి అనే ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా మారడంతో.. శైలజను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, పార్వతిని కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోవ లక్ష్మికి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే శైలజ పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా, శనివారం ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. పాఠశాలలో ఆర్‌బీఎ్‌సకే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - Nov 03 , 2024 | 04:45 AM