సైబర్ నేరాలు పైపైకి!
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:21 AM
సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్-5లో ఉండగా.. రాష్ట్రంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రైకమిషనరేట్లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.
ట్రై కమిషనరేట్లలో 20,414 కేసులు
డ్రగ్స్ కేసుల్లో సైతం పెరుగుదల
మొత్తం 1,980 మంది పెడ్లర్ల అరెస్టు
అత్యాచారాలు, వేధింపులు కూడా పైపైకి
రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు
7,861 ఘటనల్లో 1798 మంది మృతి
ఆర్థిక నేరాల్లో రూ.4వేల కోట్లు హాంఫట్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్-5లో ఉండగా.. రాష్ట్రంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రైకమిషనరేట్లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. ఈ ప్రాంతాల్లో ఇంగ్లిష్, హిందీని అర్థం చేసుకుని, మాట్లాడగలిగేవారు ఎక్కువగా ఉండడం సైబర్ కేటుగాళ్లకు అనుకూలంగా మారింది. దీంతో.. సైబర్ నేరాలు ఏటా పైపైకి ఎగబాకుతున్నాయి. బాధితులు కోల్పోతున్న మొత్తం కూడా పెరుగుతోంది. అరెస్టులు, రికవరీలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం లేదనే విమర్శలున్నాయి. సైబర్ నేరాల్లో సైబరాబాద్ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాలను రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు ఆక్రమించాయి.
డ్రగ్స్ కేసుల్లో పెరిగిన అరెస్టులు
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో.. ప్రత్యేక విభాగాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఫలితంగా అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. గంజాయి, డ్రగ్స్ పెడ్లర్లు హైదరాబాద్ రావాలంటేనే జంకుతున్నారని పోలీసులు చెబుతున్నారు.పెడ్లర్లనే కాకుండా.. మూలాలకు వెళ్తున్న పోలీసులు.. గోవా, బెంగళూరు, ముంబై, రాజస్థాన్, గుజరాత్‌లో ఉంటున్న కింగ్‌పిన్‌ల పీచమణుస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు
కూడళ్ల మూసివేత, యూటర్న్‌ల పెంపు.. ట్రిపుల్-రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్.. డ్రంకెన్ డ్రైవ్‌లతో ట్రాఫిక్ పోలీసులు రేయింబవళ్లు విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తుండడంతో.. ట్రైకమిషనరేట్లలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గుతోంది. నిబంధనలను పదేపదే ఉల్లంఘించినవారి లైసెన్సులను మోటారు వాహన సవరణ చట్టం కింద సస్పెండ్ చేస్తుండడం, జైలు శిక్షలు విధిస్తుండడంతో ప్రజల్లో నిబంధనలపై అవగాహన పెరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగినా.. మరణాలు తగ్గుముఖం పట్టాయని వివరిస్తున్నారు.
మహిళలపై పెరుగుతున్న నేరాలు
షీటీమ్స్ వంటి విధానాలు అమల్లో ఉన్నా.. నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా.. ట్రై కమిషనరేట్లలో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. చిన్నారులపై నేరాలు కూడా పెరిగాయి. మహిళలపై వేధింపుల కేసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.3ు, సైబరాబాద్‌లో 8ు, రాచకొండలో 9ు మేర పెరగడం గమనార్హం..!
చుక్కలు చూపిస్తున్న ఆర్థిక నేరగాళ్లు
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో ఆర్థిక నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, స్కీములు, భారీ లాభాల పేర్లతో అరచేతిలో వైకుంఠం చూపుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఆర్థిక నేరగాళ్లు ఈ ఏడాది సైబరాబాద్‌లో రూ. 3 వేల కోట్లు, హైదరాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల మేర కొల్లగొట్టారు. ప్రీలాంచ్ పేర్లతో మల్టీలెవల్ మార్కెటింగ్(ఎంఎల్‌ఎం-చైన్‌స్కీమ్)లను పరిచయం చేస్తున్నారు. ఆర్థిక నేరగాళ్లు తాము దోచుకున్న మొత్తాన్ని ఎప్పటికప్పుడు విలాసాలకు వినియోగిస్తుండడంతో.. అరెస్టులు మినహా.. రికవరీలు, ఆస్తుల ఫ్రీజింగ్ జరగడం లేదు. పైగా.. పోలీసులు బలమైన కౌంటర్లను దాఖలు చేయకపోవడం వల్ల.. నిందితులు యథేచ్ఛగా బెయిల్‌పై బయటకు వస్తూ.. కొత్త నేరాలు చేస్తున్నట్లు నేర గణాంకాలు చెబుతున్నాయి.
Updated Date - Dec 25 , 2024 | 03:21 AM