Hyderabad: గాలిదుమారానికే కుప్పకూలుతున్నాయ్..
ABN, Publish Date - May 16 , 2024 | 11:06 AM
ఔటర్ రింగ్‌రోడ్డు(Outer Ring Road)పై ముంపు పొంచి ఉంది. గాలి దుమారం వచ్చినా, భారీ వర్షం కురిసినా విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డుగా పడిపోతున్నాయి. వాహనదారులు గమనించకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
- ఔటర్‌పై ఆర్భాటంగా విద్యుత్‌స్తంభాల ఏర్పాటు
- నాణ్యత ప్రమాణాలపై అనుమానాలు
హైదరాబాద్ సిటీ: ఔటర్ రింగ్‌రోడ్డు(Outer Ring Road)పై ముంపు పొంచి ఉంది. గాలి దుమారం వచ్చినా, భారీ వర్షం కురిసినా విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డుగా పడిపోతున్నాయి. వాహనదారులు గమనించకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. హెచ్‌ఎండీఏ-హెచ్‌జీసీఎల్(HMDA-HGCL) ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం ఆర్భాటంగా ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలు ఒక్క గాలివానకే కుప్పకూలుతున్నాయి. ఔటర్ చుట్టూ వంద కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఎల్‌ఈడీ దీపాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి 12 మీటర్లకు స్తంభం చొప్పున 136 కిలోమీటర్ల మార్గంలో 6,340 స్తంభాలు ఏర్పాటు చేసి 13,392 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. 37 కిలోమీటర్లలోని సర్వీసు రోడ్లలో కూడా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటుచేశారు. ఔటర్ అప్ అండ్ డౌన్ ర్యాంప్‌లు సుమారు 12 కిలోమీటర్ల మేర, పలు జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానమైన ప్రాంతాల్లో కూడా 5.5 కిలోమీటర్ల మేర ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. రెండేళ్ల క్రితం పనులు పూర్తి చేయడంతో ఔటర్ మొత్తంలో ఎల్‌ఈడీ వెలుగులు అందుబాటులోకి వచ్చాయి. పనులు దక్కించుకున్న సంస్థలు ఏడేళ్ల పాటు విద్యుద్దీపాల నిర్వహణ బాధ్యతను చూడాల్సి ఉంటుంది.
ఇదికూడా చదవండి: Kamareddy: పోలీసుల అదుపులో కామారెడ్డి డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్యాకేజీ-1లో భాగంగా కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్‌చెరు, సుల్తాన్‌పూర్ వరకు 34 కిలోమీటర్ల పరిధిలో రూ.23.735 కోట్ల వ్యయంతో ఓ సంస్థ పనులు చేపట్టింది. వారం క్రితం వచ్చిన గాలి దుమారానికి పటాన్‌చెరు నుంచి కోకాపేట వైపు వచ్చే మార్గంలో విద్యుత్ స్తంభం కూలి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విషయం పెట్రోలింగ్ సిబ్బంది దృష్టికి వెళ్లడంతో కిందపడిన విద్యుత్ స్తంభాన్ని తొలగించారు. ఔటర్‌లో మరో ప్రాంతంలో కూడా వర్షం వచ్చినప్పుడు విద్యుత్ స్తంభం కూలి రోడ్డుకు అడ్డంగా పడిందని సిబ్బంది తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డులో సెంట్రల్ మీడియన్‌లో వచ్చే విద్యుత్ స్తంభాన్ని బిగించేందుకు మొదటగా కాంక్రీట్‌తో దిమ్మె ఏర్పాటు చేస్తారు. దానిపై అల్యూమినియంతో కూడిన విద్యుత్ స్తంభాన్ని బిగిస్తారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో డివైడర్ వెంట ఇవే విద్యుత్ దీపాలున్నాయి. నగరంలో అనేకమార్లు భారీ వర్షాలు, పెద్దఎత్తున గాలిదుమారాలు వచ్చాయి. అయినా, సెంట్రల్ మీడియన్‌లోని విద్యుత్ స్తంభాలు కూలలేదు. కానీ, ఔటర్‌పై గల సెంట్రల్ మీడియన్ విద్యుత్ స్తంభాలు కూలుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో విద్యుత్ స్తంభాల ఏర్పాటులో నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీ-2లో సరెగూడెం, మేడ్చల్, శామీర్‌పేట(Medchal, Sameerpet) వరకు 33 కిలోమీటర్ల మేర, ప్యాకేజీ-3లో కీసర నుంచి ఘట్‌కేసర్, పెద్దఅంబర్‌పేట వరకు 34 కిలోమీటర్లు, ప్యాకేజీ-4లో బొంగుళూర్ నుంచి తుక్కుగూడ, పెద్దగోల్కొండ వరకు 35 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల పటిష్టతను పరీక్షించాలని, మున్ముందు గ్రేటర్‌పై ఎల్‌నినో ప్రభావముంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో హెచ్‌ఎండీఏ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: BB Nagar: కులాంతర వివాహమే ప్రేమకు శాపమై..
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 16 , 2024 | 11:06 AM