Hyderabad : ఘనంగా లష్కర్ బోనాలు
ABN, Publish Date - Jul 22 , 2024 | 04:07 AM
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునుంచే మహాకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు.
లష్కర్‌లోని అమ్మవారి ఆలయాల వద్ద బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్తల కుటుంబానికి చెందిన సురిటి రామేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
పొన్నం ప్రభాకర్ కుటుం బ సభ్యులు అమ్మవారికి బంగారు బోనం, రాష్ట్ర ప్రభు త్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 8.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు అమ్మవారికి పూజలు చేశారు.
దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని కోరుకున్నానని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి పూజలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అమ్మవారికి ఘనంగా బోనం సమర్పిస్తానని మొక్కుకున్నానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Updated Date - Jul 22 , 2024 | 04:07 AM