ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

City Police: నిరసనలపై నిషేధం

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:09 AM

తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నెల రోజులపాటు బీఎన్‌ఎ్‌స 163 సెక్షన్‌ (గతంలో 144 సెక్షన్‌)ను విధిస్తూ హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

  • హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 163 సెక్షన్‌ అమలు

  • ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లకు దిగొద్దని ఆదేశాలు

  • నలుగురికి మించి గుమికూడితే చర్యలు: సీపీ ఆనంద్‌

  • ధర్నాచౌక్‌లో టీజీఎస్పీ కానిస్టేబుళ్ల నిరసన అడ్డగింత

  • 21 మందిపై కేసు.. డిచ్‌పల్లి బెటాలియన్‌లో ర్యాలీ

  • సచివాలయ భద్రతా సిబ్బంది నిరసనలకు వెళ్లొద్దు

  • సోషల్‌ మీడియా గ్రూప్‌ల నుంచి వైదొలగాలి: సీఎస్‌వో

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ/డిచ్‌పల్లి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నెల రోజులపాటు బీఎన్‌ఎ్‌స 163 సెక్షన్‌ (గతంలో 144 సెక్షన్‌)ను విధిస్తూ హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సిటీ కమిషనరేట్‌ పరిధిలో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లపై నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు నవంబరు 28వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా అల్లరి మూకలు, అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఇతర గ్రూపులకు చెందిన వ్యక్తులు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఫ్లకార్డులు, జెండాలు పట్టుకొని నినాదాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, సభలు, సమావేశాలు నిర్వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


పోలీస్‌ అధికారులంతా హోంగార్డులతో సహా.. విధుల్లోనే ఉంటారని తెలిపారు. సైనికోద్యోగులు, విద్యాశాఖకు చెందిన ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ సైతం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. నెల రోజులపాటు.. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నగరంలో పటిష్టమైన నిఘాతోపాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అన్ని ప్రాంతాల్లో అడుగడుగునా పోలీస్‌ నిఘా ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ ఆదేశాలు అమల్లో ఉండగానే.. పలువురు టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు వచ్చారు. వారిని దోమలగూడ పోలీసులు అడ్డుకొని అరెస్టు చే శారు. ఈ సందర్భంగా టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


  • 21 మంది కానిస్టేబుళ్లపై కేసు..

ధర్నా చౌక్‌లో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన 21 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. క్రిమినల్‌ కేసులతోపాటు 21 మంది సిబ్బందికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311(2)(బి) ప్రకారం షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు అదనపు డీజీపీ (బెటాలియన్‌) సంజయ్‌ జైన్‌ తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు సచివాలయంలో భద్రతా విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బందికి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) నుంచి గట్టి హెచ్చరికలు జారీ అయ్యాయి.


సచివాలయంలో టీజీఎస్పీ అధికారులు, సిబ్బందే భద్రతాపరమైన విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో సీఎ్‌సవో ఈ హెచ్చరికలు చేశారు. ‘‘సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మనపై చాలా మంది నిఘా ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహించేవారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పోస్టులు పెడుతున్నారు.. వంటి విషయాలను పరిశీలిస్తారు. టీజీఎస్పీ అధికారులు, సిబ్బంది ఎవరైనా.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కలుగజేసుకోవద్దు. సచివాలయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా.. దాని ప్రభావం టీజీఎస్పీ వ్యవస్థపై పడుతుంది. సచివాలయం నుంచి అందరం వెళ్లిపోవాల్సి వస్తుంది’’ అని సీఎ్‌సవో హెచ్చరించారు.


సోమవారం నుంచి సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధి మేర 144 సెక్షన్‌ అమల్లో ఉందని తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడవద్దని, ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడిలాంటి వాటిలో పాల్గొన్నవారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టొద్దని, ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు వంటి వాటిలో అనుమతి లేకుండా పాల్గొనవద్దు. పొరపాటున దొరికితే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కాగా, బెటాలియన్‌ కానిస్టేబుళ్లు సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


  • డిచ్‌పల్లిలో నిరసన ర్యాలీ

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌లో ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరసన తెలిపిన బెటాలియన్‌ల కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.


సీఎం నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో మార్పు

టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ఆందోళనల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద బందోబస్తు విధులు నిర్వహించిన బెటాలియన్‌ పోలీస్‌ సిబ్బందిని ఆ బాధ్యతల నుంచి సీఎం సెక్యూరిటీ వింగ్‌ తప్పించింది. వారి స్థానంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) సిబ్బందితో భద్రత కల్పించింది. సీఎం ఇంటికి మూడు వైపులా ఉన్న 22 మంది టీజీఎస్పీ సిబ్బందిని మార్చి ఏఆర్‌ సిబ్బందిని నియమించారు.

Updated Date - Oct 29 , 2024 | 03:11 AM