Old City Murder Case: డాన్ అయ్యేందుకు మర్డర్.. రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో ట్విస్ట్
ABN, Publish Date - Aug 14 , 2024 | 04:48 PM
రియాజ్ హత్య కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ప్రధాన నిందితుడు హమీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ రియాజ్ హత్య కోసం రూ.13 లక్షల సుపారీ తీసుకున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారన్నారు.
హైదరాబాద్, ఆగస్ట్ 14: బాలాపూర్‌లో జరిగిన గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. బుధవారం ఎల్బీ నగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీ సుధీర్ బాబు మాట్లాడారు.
8 మంది అరెస్ట్.. పరారీలో ప్రధాన నిందితుడు..
ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు హమీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ రియాజ్ హత్య కోసం రూ.13 లక్షల సుపారీ తీసుకున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారన్నారు. అలాగే నిందితుల నుంచి కంట్రీ మేడ్ గన్, రెండు బుల్లెట్స్, రెండు గొడ్డళ్లుతోపాటు ఓ కత్తిని సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Also Read: Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు
వివాదానికి మూల కారణం ఇదే..
మీర్‌పేటలో వాటర్ ట్యాంక్ నిర్మించిన స్థల వివాదం వీరి మధ్య ఘర్షణకు అసలు మూల కారణమని వివరించారు. అలా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మృతుని మధ్య గొడవలు రోజురోజుకు పెరిగి పోయాయన్నారు. ఇక మృతుడు రౌడీ షీటర్ రియాజ్.. మీర్‌పేటలో భూ వివాదంపై ఒకరిపై ఒకరు కేసులు సైతం పెట్టుకున్నా విషయాన్ని ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు గుర్తు చేశారు.
Also Read: Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!
ఈ హత్యకు రూ. 13 లక్షల సుపారీ..
ప్రధాన నిందితుడు హమీద్.. గోల్కొండకు చెందిన సలీంకు రూ.13 లక్షల సుపారీ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. ఆ క్రమంలో అడ్వాన్స్‌గా రూ. 2.50 లక్షలు ఇచ్చారని తెలిపారు. ముందుగా హత్యకు పథక రచన చేసి హమీద్.. దుబాయ్ వెళ్ళి పోయాడన్నారు. అంతకుముందు సలీం, హమీద్ ఉత్తరప్రదేశ్ వెళ్లి.. కంట్రీ మేడ్ గన్ కొనుగోలు చేశారని చెప్పారు. ఆ తర్వాత మొయినాబాద్ వద్ద గొడ్డళ్లు, కత్తులు కొనుగోలు చేశారని వివరించారు.
అనంతరం రియాజ్‌ను హత్య చేసేందుకు ముందే రెక్కీ సైతం నిర్వహించారన్నారు. అలా కంచన్‌బాగ్‌లోని ఓ వైన్స్ షాపులో రియాజ్ మద్యం తాగి బైక్‌పై వస్తుండగా... అతడిని కార్‌తో డీకొట్టారని చెప్పారు. ఆ తర్వాత అతడు కింద పడగానే కళ్లలో కారం చల్లి.. అతడిపై కత్తితో పాటు గొడ్డళ్ళతో దాడి చేశారని వివరించారు. అనంతరం గన్‌తో సలీం షూట్ చేయడంతో.. రియాజ్ మరణించాడని తెలిపారు.
ఈ హత్య తర్వాత విజయవాడ.. అటు నుంచి విశాఖ మీదగా భువనేశ్వర్...
ఈ హత్య అనంతరం నిందితులు విజయవాడ చేరుకున్నారని... అక్కడ వారు కారును వదిలి వేసి వైజాగ్‌కు బస్‌లో వెళ్లారని తెలిపారు. అక్కడి నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారని.. అక్కడ వారిని వలపన్నీ అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ కేసులో A7గా ఉన్న నిందితుడు ఇనాయత్ ఈ మర్డర్ ప్లాన్‌కి నగదు సమకూర్చినట్లు తమ విచారణలో తేలిందన్నారు. అయితే రియాజ్‌ను హత్య చేస్తే.. తాను డాన్ అవుతానని నిందితుడు హమీద్ భావించాడని సీపీ సుధీర్ బాబు వివరించారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 14 , 2024 | 05:47 PM