Hyderabad: సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ఎల్బీనగర్ పాయింట్‌లో 6 ప్రత్యేక క్యాంపులు
ABN, Publish Date - Jan 13 , 2024 | 11:20 AM
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నగరంలో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు తమ త మ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు.
హయత్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నగరంలో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు తమ త మ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని విజయవాడ(Vijayawada) జాతీయ రహదారి రోడ్లు వాహనాలతో కిక్కిరిసి పోతాయి. సంక్రాంతి నేపథ్యంలో గురువారం నుంచే హయత్‌నగర్(Hayatnagar) డివిజన్‌కు చెందిన ఆర్టీసీ అధికారులు ఎల్బీనగర్ పాయింట్ వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ అధికారులు పండగను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Telangana, Andhra Pradesh)లోని వివిధ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా అన్ని జిల్లాలకు రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ వారి కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఎల్బీనగర్ చౌరస్తా వద్ద 6 ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. హయత్‌నగర్ డీవీఎం సుచరిత పర్యవేక్షణలో హయత్‌నగర్‌లోని 1, 2 డిపోలు, మిధానీ, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, బండ్లగూడ డిపో మేనేజర్లు క్యాంపుల వద్ద ఉండి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్పిస్తున్నారు. హైదరాబాద్ నుండి ఖమ్మం, భద్రాచలం, మథిర, కొత్తగూడెం, సత్తుపల్లి, నల్లగొండ, మిర్యాలగూడకు బస్సులు నడిపిస్తున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయాల వద్ద ప్రయాణికుల కోసం టెంట్లు, కుర్చిలు, తాగునీరు, లైట్లు, బయోటాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు డీవీఎం తెలిపారు. ప్రయాణికుల కోసం 24 గంటల పాటు కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారని డీవీఎం తెలిపారు.
Updated Date - Jan 13 , 2024 | 11:20 AM