Big shock: బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్..
ABN, Publish Date - Dec 15 , 2024 | 11:39 AM
తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలకు బిగ్ షాక్ తగిలింది. వారి నివాసాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. కె.బి.ఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా మార్కింగ్ చేసింది. బాలకృష్ణ ఇంటిని ఆరడుగుల లోపల వరకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna), కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader), మాజీ మంత్రి జానారెడ్డి (Ex Minister Janareddy)లకు బల్దియా షాక్ (Baldia Shock) ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్ళకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. కె.బి.ఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా మార్కింగ్ చేసింది. బాలకృష్ణ ఇంటిని ఆరడుగుల లోపల వరకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. కళింగ చౌరస్తా నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఆస్తుల సేకరణలో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. 86 ఆస్తుల సేకరణ లిస్టులో బాలయ్య, మాజీ మంత్రి జానారెడ్డి ఇళ్లు ఉన్నాయి. ఆస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ సర్వే ప్రారంభించింది. అయితే తన ఇంటికి అధికారులు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి సీరియస్ అయ్యారు.
కాగా మాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్ల డివైనింగ్‌లో భాగంగా బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12 లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు. బాలకృష్ణ ఇంటికి సుమారు ఆరు ఫీట్ల వరకు మార్కింగ్ వేశారు. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్‌లు, ఎనిమిది చోట్ల స్టీల్ బ్రిడ్జిలను ప్రభుత్వం నిర్మించనుంది. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. అలాగే జుబ్లీహల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్డు నెంబర్ 36 వైపు వెళ్లే దారిలో ఫ్లై ఓవర్లు రానున్నాయి. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పాలకమండలి గడువు అదే నెల 10న ముగియనుంది. ఈ లోపు పార్కు చుట్టూ కొన్నిచోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రేటర్‌లో ఒకేచోట భారీగా పనులు మొదలు పెట్టడం ఇదే మొదటిది.
జూబ్లీ చెక్‌పోస్ట్‌వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రానున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లనుంది. వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ని ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరేచోట ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ..
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెకోపోస్టు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డునెంబర్-12 నుంచి జూబ్లీహిల్స్ చెకో పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్- 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్- 45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-1 రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా..ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్నట్లు తెలుస్తోంది. మా ఇంటికే మార్కింగ్ వేస్తారా? అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి. మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు. బంజారాహిల్స్-జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12లోని అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు రోడ్డుకు ఒకవైపే ఆస్తులు సేకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 అడుగుల రోడ్డు మాత్రమే 120 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఒకవైపు కేబీఆర్ పార్కు గోడ ఉండగా, ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడం లేదు. సమరసింహారెడ్డి, జానారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉంటున్న వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగనుంది. ఆ మేరకే మార్కింగ్ వేశారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12 విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్- 12 నుంచి జూబ్లీహిల్స్ చెకో పోస్టు వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. అయితే పనులు ముందుకుసాగడంలోనే అధికారులకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అంతా ప్రముఖులే కావడం, ప్రభుత్వంలో ఉండడం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా
మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం
జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన
ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 15 , 2024 | 11:50 AM