ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

ABN, Publish Date - Oct 21 , 2024 | 07:54 AM

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

  • నిధుల సమీకరణకు వేగంగా అడుగులేస్తున్న ప్రభుత్వం

  • అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు

  • తొలుత 5 కారిడార్లకు 48% నిధుల సేకరణ

  • కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకుసాగే ప్రయత్నం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్‌ ఫేజ్‌లో తొలుత ప్రతిపాదించిన 5 కారిడార్ల నిర్మాణానికి కావాల్సిన రూ.24,237 కోట్లలో 48% నిధులను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్రో రెండో దశ పనులపై ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోని మార్గాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

నాగోల్‌–ఆర్‌జీఏఐ (ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌) 36.6 కి.మీ, రాయదుర్గ్‌–కోకాపేట్‌ నియోపోలీస్‌ 11.6 కి.మీ, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట (ఓల్డ్‌సిటీ కారిడార్‌) 7.5 కి.మీ, మియాపూర్‌–పటాన్‌చెరు 13.4 కి.మీ, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ 7.1 కి.మీ, ఎయిర్‌పోర్టు–ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల పనులను రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డీటైయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం పొందిన వెంటనే అనుమతుల కోసం కేంద్రానికి పంపనున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు.


తక్కువ వడ్డీతో రుణాల సేకరణ..

రెండో దశలో ప్రతిపాదించిన మొత్తం 6 కారిడార్లలో.. తొలుత నాగోల్‌–ఆర్‌జీఏఐ, రాయదుర్గ్‌–కోకాపేట్‌ నియోపోలీస్‌, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట, మియాపూర్‌– పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గాల పనులను ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్టు–ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల పనులను సెకండ్‌ ఫేజ్‌ డీపీఆర్‌లో పెడుతున్నప్పటికీ.. ఈ పనులను కాస్త ఆలస్యంగా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే 5 కారిడార్లకు సంబంధించిన రూ.24,237 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 18%, రాష్ట్ర ప్రభుత్వం 30 % ఖర్చు భరించనుంది. మరో 4 శాతం ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) ద్వారా, 48 శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించాలని భావిస్తున్నారు. కాగా, మొదటి దశలోని 69.2 కిలోమీటర్ల పనులను ఎల్‌అండ్‌టీ పూర్తిగా పీపీపీ మోడల్‌లో చేపట్టింది.


ఈ మేరకు అప్పటి ప్రభుత్వం నిర్వహణ ఖర్చులకుగాను ఎల్‌అండ్‌టీకి రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో 267 ఎకరాలు కేటాయించింది. తొలుత 35 ఏళ్లపాటు లీజు అగ్రిమెంట్‌ కుదుర్చుకోగా.. నిర్మాణ వ్యయం ఎక్కువైన తరుణంలో తర్వాత మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అంటే మొత్తం 60 ఏళ్లపాటు ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని మెట్రో రైలు నిర్వహణను చేపట్టాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే రెండో దశలో పీపీపీ వాటా కేవలం 4% మాత్రమే ఉండడంతో అంతర్జాతీయ బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్న 48% వాటాకు సమానంగా మరో 48 శాతం బ్యాంకుల ద్వారా సేకరించాల్సి వస్తోంది. దీంతో 1.5 లేదా 2% తక్కువ వడ్డీతో రుణాలు అందించే బ్యాంకుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటికే జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) బ్యాంకు ప్రతినిధులతో ప్రభుత్వ పెద్దలు సమావేశమైన నేపథ్యంలో దానినుంచే ఎక్కువ మొత్తంలో సేకరించే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.


కేంద్ర ప్రభుత్వ సహకారంతో..

అర్బన్‌ మొబిలిటీకి సంబంధించిన పనుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గత ప్రభుత్వం నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో రెండో దశ విస్తరణ పనులను పట్టాలెక్కించే విషయంలో ఆసక్తి చూపించలేదనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేని కారణంగా రెండో దశలో కనీసం కిలోమీటరు పనులు కూడా జరగలేదని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర సర్కారు సహకారంతో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. మెట్రో నిర్మాణానికి కావాల్సిన అనుమతులతో పాటు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు సేకరించేందుకు సాయం కోరేందుకు సిద్ధమైంది. ప్రధానంగా జైకా లాంటి ఇంటర్నేషనల్‌ బ్యాంకులను ఒప్పించేందుకు సహకారం అందించాలని కోరుతోంది. కాగా, 5 కారిడార్ల పనులను ప్రారంభించిన తర్వాత ఫోర్త్‌సిటీ కారిడార్‌ను నెమ్మదిగా పట్టాలెక్కించనున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 07:54 AM