ఉప్పల్‌లో ఐపీహెల్
ABN, Publish Date - Apr 14 , 2024 | 03:19 AM
ఉప్పల్ స్టేడియంలో ఒక్క సారైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. అభిమాన క్రికెటర్లను నేరుగా వీక్షించాలి....
ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు
చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం
కాసుల కక్కుర్తితో కనీస సదుపాయాలకు పాతర
టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం
టికెట్లు లేకున్నా వందలాది మంది లోపలికి ఎంట్రీ
తమవారిని తీసుకెళ్లడంలో అధికార్ల పోటాపోటీ
పార్కింగ్‌కు అష్టకష్టాలు.. 2 కి.మీ. నడవాల్సిందే
ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్నా ధరలు రెండింతలు
కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు పనిచేయని వైనం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉప్పల్ స్టేడియంలో ఒక్క సారైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. అభిమాన క్రికెటర్లను నేరుగా వీక్షించాలి. మ్యాచ్ ఆసాంతం కేరింతల మధ్య ఉర్రూతలూగాలి... అని కోరుకోని సగటు క్రికెట్ అభిమాని ఉండరు. కానీ.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అభిమానులు.. అక్కడి వసతులు చూసి ఉసూరుమంటున్నారు. పేటీఎం యాప్‌లో లభించకపోయినా అష్టకష్టాలు పడి, చచ్చీచెడి టికెట్లు కొనుగోలు చేసి, ఉత్సాహంగా స్టేడియానికి వెళుతున్న వారికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం చుక్కలు ఉప్పల్ స్టేడియంలో ఒక్క సారైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. అభిమాన క్రికెటర్లను నేరుగా వీక్షించాలి. మ్యాచ్ ఆసాంతం కేరింతల మధ్య ఉర్రూతలూగాలి... అని కోరుకోని సగటు క్రికెట్ అభిమాని ఉండరు. కానీ.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అభిమానులు.. అక్కడి వసతులు చూసి ఉసూరుమంటున్నారు. పేటీఎం యాప్‌లో లభించకపోయినా అష్టకష్టాలు పడి, చచ్చీచెడి టిక్కెట్లు కొనుగోలు చేసి, ఉత్సాహంగా స్టేడియానికి వెళుతున్న వారికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం చుక్కలు చూపిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి కారణంగా వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు మ్యాచ్ చూడడానికి ముందే నరకం చూడాల్సి వస్తోంది. ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పార్కింగ్. వీవీఐపీలు, వీఐపీలు, పోలీసులు, ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులకు తప్ప, మరెవరికి స్టేడియం వెలుపల లేదా దరిదాపుల్లో వాహనాలు పార్కింగ్ చేసే సదుపాయం లేదు. దీంతో అభిమానులు రోడ్ల పక్కన, ఎక్కడపడితే అక్కడ తమ వాహనాలను వదిలేసి, రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మ్యాచ్ అయిపోయాక వచ్చి చూస్తే ద్విచక్ర వాహనాలు కిందపడిపోయి ఉండడం, కార్లకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం పరిపాటిగా మారింది. కనీసం రూ.30వేలు పెట్టి కార్పొరేట్ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికైనా పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం దారుణమని అభిమానులు మండిపడుతున్నారు.
టిక్కెట్లు లేకున్నా ఎంట్రీ..
హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీలు, పోలీసులు మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికి టిక్కెట్లు లేకుండా తమ వాళ్లను లోపలకి తీసుకెళ్లడంలో పోటీ పడుతున్నారు. గేట్ల వద్ద టిక్కెట్లు స్కాన్ చేసి అనుమతించాల్సిన ఎస్‌ఆర్‌హెచ్ సిబ్బంది వీళ్లకు అడ్డు చెప్పడంలో విఫలమవుతుండడంతో టిక్కెట్లు కొని, మ్యాచ్ చూడడానికి వచ్చిన వారికి అవస్థలు తప్పడం లేదు. అనధికారికంగా స్టేడియంలోకి ప్రవేశించిన వాళ్లు తమ సీట్లలో కూర్చొని లేవకపోవడంతో టిక్కెట్లు కొనుగోలు చేసినోళ్లు వారితో గొడవ పడాల్సి వస్తోంది. కొంతమందైతే స్టాండ్స్‌కు మధ్య ఉన్న మెట్లపైన, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని మ్యాచ్ చూస్తున్నా ఎస్‌ఆర్‌హెచ్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈనెల 5న చెన్నైతో మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని ఓ స్టాండ్‌లో సీటు నంబర్ 65 తర్వాత 67 ప్రత్యక్షమైంది. వీటి మధ్యలో ఉండాల్సిన 66వ సీటు నంబర్‌ను మరో చోట అతికించారు. దీంతో రూ.4,500 వెచ్చించి టిక్కెట్ కొన్న 66వ నంబర్ సీట్‌లోని ప్రేక్షకుడు మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చింది. తనకు ఎదురైన సమస్యపై అక్కడున్న ఎస్‌ఆర్‌హెచ్ సిబ్బందిని ప్రశ్నిస్తే, వారి నుంచి సమాధానం కరువైందని సదరు అభిమాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.
కనీస సదుపాయాలు కరువు
వేల రూపాయలు ఖర్చు చేసి, స్టేడియంకు వచ్చిన ఫ్యాన్స్‌కు తాగు నీటిని అందించడంలోనూ ఎస్‌ఆర్‌హెచ్ విఫలమైంది. అసలే వేసవి కాలం కావడంతో దాహానికి అభిమానులు గొంతు తడుపుకోవడానికి వాటర్ బాటిల్స్‌పైన ఆధారపడాల్సిన పరిస్థితి. చెన్నై మ్యాచ్ సందర్భంగా బాత్‌రూమ్స్‌లో నీటి కొరత ఏర్పడింది. ఆ రోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తమ వెంట వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాల్సి వచ్చిందని పలువురు ఫ్యాన్స్ వాపోయారు. ఇక, కార్పొరేట్ బాక్సుల్లో పరిస్థితి మరీ దారుణం. ఈ బాక్సుల్లో కనీసం ఏసీ కూడా సరిగ్గా రావడం లేదని, నాణ్యమైన ఆహారం కూడా అందించడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. స్టేడియంలో ఉన్న గదులకు దాదాపు 200 టన్నుల ఏసీ ప్లాంట్ అవసరం కాగా, 80 టన్నుల సామర్థ్యమున్న ఏసీ ప్లాంట్‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో మ్యాచ్ సమయంలో ఏసీలు మెరాయిస్తున్నాయని తెలుస్తోంది. ఇక, సాధారణ స్టాండ్స్ వద్ద ఉన్న ఫుడ్ స్టాళ్లలో ఏది కొనుగోలు చేయాలన్నా రెట్టింపు చెల్లించాల్సి వస్తోందని, అక్కడి ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇప్పటికైనా కళ్లు తెరిచి, కాసులపైన మాత్రమే కాకుండా, కనీస సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.
Updated Date - Apr 14 , 2024 | 03:19 AM