TS Politics: రంగంలోకి దిగిన కేసీఆర్.. ఎంపీలతో భేటీ.. ఏమేం చర్చించారంటే..?
ABN, Publish Date - Jan 26 , 2024 | 05:58 PM
బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతల సమావేశం శుక్రవారం నాడు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఫాం హౌస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోతున్నారు.
సిద్దిపేట: బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతల సమావేశం శుక్రవారం నాడు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఫాం హౌస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోతున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేశవరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను నేతలు మీడియాకు వివరించారు.
ఫిబ్రవరి ఒకటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు జోష్‌లో ఉండడం వీటిని ఎలా ఎదర్కొవాలనే విషయంపై క్యాడర్‌తో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆ ప్రాజెక్టులు కృష్ణాబోర్డుకు అప్పగిస్తే తీవ్రంగా నష్టపోతాం: కేసీఆర్
ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణాబోర్డుకు అప్పగిస్తే తీవ్రంగా నష్టపోతామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు. మనం ఏం చేశామో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటో ప్రజలకు వివరించాలని అన్నారు. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రభుత్వం విఫలం అవుతుందన్నారు. ప్రభుత్వంపై ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత వస్తుందని.. ఈ అంశాన్ని పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగించుకోవాలని సూచించారు. విభజన చట్టంలోని హామీల కోసం పార్లమెంట్‌లో కొట్లాడాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మరోసారి ఎంపీలతో సమావేశం అవుతానని కేసీఆర్ తెలిపారు.
ఆ విషయాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం: ఎంపీ నామా నాగేశ్వరరావు
పార్లమెంట్‌లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు (Name Nageswara Rao) తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలు పార్లమెంట్‌లో లేవనెత్తుతామని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలు, రావాల్సిన నిధులు, కృష్ణ రివర్ బేసిన్ అంశం, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్‌లో నిలదీస్తామని నామా నాగేశ్వరరావు చెప్పారు.
పార్లమెంట్‌లో గళం వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలే: రంజిత్ రెడ్డి
పార్లమెంట్ పార్టీ మీటింగ్‌లో రాబోయే ప్రెసిడెన్షియల్ అడ్రస్, ఓట్ ఆన్ ఎకౌంటు అనే రెండు అంశాలపైన చర్చించినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) తెలిపారు. తెలంగాణ కోసం, తెలంగాణ బలం, గళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలేనని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన విషయాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్ (MP Dayakar) మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలో పొందు పరిచిన విషయాలపై చర్చించాలని కేసీఆర్ చెప్పారన్నారు. బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ, ప్రజల పక్షానా ఉండి ప్రజల కోసం మాట్లాడాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని ఎంపీ దయాకర్ తెలిపారు.
Updated Date - Jan 26 , 2024 | 06:25 PM