Telangana: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..
ABN, Publish Date - Oct 12 , 2024 | 08:47 AM
సగటు జీవి.. తన జీవితంలో ఒక సొంత ఇల్లు ఉంటే చాలనుకుంటాడు. అందుకు కోసం తన సంపాదనలో ఒకొక్క రూపాయి పొగు చేసి.. సొంత ఇంటిని నిర్మించుకుంటాడు. అయితే ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలే.. పేదలకు ఆ పథకం పేరుతో ఈ పథకం పేరుతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సగటు జీవి.. తన జీవితంలో ఒక సొంత ఇల్లు ఉంటే చాలనుకుంటాడు. అందుకు కోసం తన సంపాదనలో ఒకొక్క రూపాయి పొగు చేసి.. సొంత ఇంటిని నిర్మించుకుంటాడు. అయితే ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలే.. పేదలకు ఆ పథకం పేరుతో ఈ పథకం పేరుతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. వీటిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలో ఈ కమిటీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది.
గ్రామ పంచాయతీ, మునిసిపల్ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమిటీల నియామకంపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఇక కమిటీల నియామకానికి పేర్లను సైతం పంపాలని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించింది. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి సర్పంచ్ లేదా పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
మునిసిపల్ వార్డు స్థాయిలో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉండనున్నారు. ఈ రెండు కమిటీల్లో.. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, గ్రామ, మునిసిపల్ వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ముగ్గురిని సభ్యులుగా నియమించనున్నారు. వీరిని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరుగా నియమించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కమిటీల్లో నియమించేవారి పేర్లను ఎంపీడీవో, మునిసిపల్ కమిషనర్లుతోపాటు జిల్లా కలెక్టర్లకు పంపాలని తెలిపింది. వీటికి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆమోద ముద్ర వేయనున్నారు. అనంతరం కమిటీల చైర్మన్లు, కన్వీనర్లు, సభ్యులకు ఈ పథకం అమలుపై అవగాహన తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సహాయంగా ఉండడంతో పాటు సోషల్ ఆడిట్‌ను ఈ కమిటీలు నిర్వహించనున్నాయి. అర్హులకు ఇల్లు అందకపోవడం, అలాగే అనర్హులకు దక్కడం లాంటివి ఏమైనా జరిగితే.. ఆ వివరాలను ఎంపీడీవోలకు, మునిసిపల్ కమిషనర్లకు తెలియజేయడంలో కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి.
సొంత ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు..
మరోవైపు గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఈ కమిటీలకు అందించనున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా కమిటీ చైర్మన్, సభ్యులకు గ్రామ, మునిసిపల్ వార్డు స్థాయిలో ఇళ్లు లేని అర్హులైన పేదల వివరాలు తెలిసి ఉంటే ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులు, కమిటీ క్షేత్రస్థాయిలో గుర్తించిన వారి జాబితాను పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం ఇప్పటి వరకు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్బన్ పరిధిలో 23.50 లక్షలు, రూరల్‌లో 58.50 లక్షలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా..
మరోవైపు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్థానిక నాయకులనే భాగస్వామ్యం చేశారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో స్థానిక నాయకుల ప్రభావం కీలకంగా ఉంటుంది. ఇది ఓటరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు ఇందిరమ్మ ఇళ్లు ఆశిస్తున్న ఓటరు తప్పని సరిగా ఆయా ప్రాంతాల్లోని స్థానిక నాయకులను కలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే మాత్రం ఈ వ్యూహాన్ని అమలు చేయక తప్పదని రేవంత్ సర్కార్ భావించినట్లు సదరు సర్కిల్‌లో ప్రచారం సాగుతుంది.
For Telangana News And Telugu News..
Updated Date - Oct 12 , 2024 | 10:54 AM