శరత్ రూ.14 కోట్లు ఎందుకిచ్చారు?
ABN, Publish Date - Apr 14 , 2024 | 03:04 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారులలో ఎమ్మెల్సీ కవితే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని నిరూపించేలా సీబీఐ విచారణ జరుగుతోంది...
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా?
వ్యాపారం చేయలేవని భయపెట్టారా?
జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి?
కవితకు 5 గంటలు సీబీఐ ప్రశ్నలు
సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ
జవాబులు దాటవేసిన ఎమ్మెల్సీ కవిత
అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారులలో ఎమ్మెల్సీ కవితే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని నిరూపించేలా సీబీఐ విచారణ జరుగుతోంది. మద్యం విధానం రూపకల్పన, ఇతరులను బెదిరించడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా నిధుల తరలింపు వ్యవహారంపై తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు శనివారం విచారించారు. విజయ్ నాయర్, ఇతరుల ద్వారా ఆమ్‌ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల తరలింపు, ఆప్‌కు చెల్లించిన డబ్బులను ఇతరుల నుంచి వసూలు చేయడంలో ఎంచుకున్న పద్దతులపై ఆమెను ప్రశ్నించింది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. మద్యం కుంభకోణంలో కవిత విచారణ కోసం మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం కవితను 4-5 గంటల పాటు సీబీఐ విచారించింది. ఇతర నిందితుల, ప్రభుత్వ అధికారుల పాత్రపై సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు దక్కినందుకు ప్రతిఫలంగా భూమి అమ్మకం పేరుతో ఆయన దగ్గర నుంచి వసూలు చేసిన రూ.14 కోట్లకు సంబంధించిన సాక్ష్యాలను సీబీఐ ఆమె ముందు ఉంచి ప్రశ్నించింది. ఆ డబ్బులు ఎక్కడికి తరలించారో చెప్పాలని కోరింది. డబ్బు చెల్లించాక కూడా శరత్ చంద్రారెడ్డికి భూమి బదలాయింపు చేయక పోవడం, ఐదు రిటైల్ జోన్లకు మొత్తం రూ.25 కోట్లు(జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున) ఇవ్వాలని లేకపోతే వ్యాపారానికి నష్టం చేస్తానని బెదిరించారన్న ఆరోపణపై ప్రశ్నించినట్లు తెలిసింది. తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శరత్‌చంద్రారెడ్డి ఇచ్చిన రూ.80 లక్షలపై ఆరా తీసినట్లు తెలిసింది. బినామీ అరుణ్ పిళ్లై రూపంలో ఇండో స్పిరిట్ హోల్‌సేల్ లైసైన్స్‌లో కవిత భాగస్వామి అయిందన్న ఆరోపణలపై అడిగినట్లు తెలిసిందన్నారు. సీబీఐ అధికారుల ప్రశ్నలలో కొన్నిటికి కవిత ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. చాలా ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. శనివారం సాయంత్రం కవితను ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్ కలిశారు. సీబీఐ దర్యాప్తు తీరుపై వారితో ఆమె చర్చించినట్లు తెలిసింది. సీబీఐ ప్రశ్నించడం, అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం కొట్టివేసిన నేపథ్యంలో న్యాయపరంగా ముందుకెళ్లడం ఎలా అన్నదానిపై చర్చించినట్లు తెలిసింది.
Updated Date - Apr 14 , 2024 | 03:04 AM