Hydra: మళ్లీ ఆక్రమణల కూల్చివేత షురూ
ABN, Publish Date - Dec 07 , 2024 | 02:44 AM
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కొరడా ఝుళిపిస్తోంది. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ సంస్థ..మళ్లీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది.
రంగంలోకి హైడ్రా బృందాలు
నాగారంలో సర్కారు స్థలంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ కూల్చివేత
హైదరాబాద్ సిటీ/నేరేడ్‌మెట్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కొరడా ఝుళిపిస్తోంది. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ సంస్థ..మళ్లీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లో చెరువు బఫర్ జోన్‌లోని సర్కారు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్‌లోని కొంత భాగం, ప్రహరీ గోడను శుక్రవారం హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని కొంత మేర ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించిన ఓ వ్యక్తి.. అది ప్రైవేట్ స్థలమని కోర్టులో సమాచారమిచ్చి స్టే తీసుకువచ్చాడు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. సంబంధిత విభాగాలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వేచేయించి వాస్తవాలు నిగ్గు తేల్చింది. మేడ్చ ల్ జిల్లా యాప్రాల్‌లోని నాగిరెడ్డికుంట బఫర్ జోన్‌లో మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి డీఎన్‌ఆర్ పేరిట ఫంక్షన్ హాల్ నిర్మించాడు.
ఆ ఫంక్షన్ హాల్ కొంత మేర సర్కా రు స్థలంలో నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు రావడం తో కమిషనర్ రంగనాథ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, నీటిపారుదల, హెచ్‌ఎండీఏ, మునిసిపల్ అధికారులకు సూచించారు. వారి సర్వేలో నాగిరెడ్డికుంట బఫర్ జోన్‌లోని రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఉన్న సర్వే నం.14, 32లలోని దోబీఘాట్ స్థలం కొంత భాగంలో ఫంక్షన్ హాల్ ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 200 చదరపు గజాల స్థలం ఆక్రమించినట్టు నిర్ధారించారు. దీంతో ఆ మేరకు ఫంక్షన్ హాల్, కాంపౌండ్ వాల్‌ను నేలమట్టం చేశారు. గతంలోనూ ఈ నిర్మాణాన్ని మునిసిపల్ అధికారులు కూల్చారు. అయితే ఫంక్షన్ హాల్‌ను పూర్తిగా పట్టా భూమిలో నిర్మించినట్టు కోర్టుకు వివరాలు సమర్పించి యజమాని స్టే తీసుకువచ్చాడు. సర్వేలో ప్రభుత్వ భూమి అని తేలడంతో జీహెచ్‌ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 405 ప్రకారం నోటీసులు లేకుండా కూల్చివేసినట్టు హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి. ఫంక్షన్ హాల్ సుమారు 3000 చదరపు గజాల్లో ఉంది. యాప్రాల్ ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో హైడ్రా కూల్చివేతలు
నాగారంలోని ఈస్ట్ హనుమాన్ నగర్‌లో రోడ్డును ఆక్రమించి స్థానిక మునిసిపల్ చైౖర్మన్ చంద్రారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చివేత.
బడంగ్‌పేట అల్మా్‌సగూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ తొలగింపు.
ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టి అక్రమంగా డంప్ చేసిన సంధ్య కన్వెన్షన్ బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు.
Updated Date - Dec 07 , 2024 | 02:44 AM