HYDRA: ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు.. ఆ 52 మంది అధికారులకూ చుక్కలే..
ABN, Publish Date - Aug 30 , 2024 | 11:25 AM
ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి.
హైదరాబాద్: ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించడం జరిగింది. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ చేయనున్నారు. కాగా.. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు వారందరికీ చుక్కలు చూపించనున్నట్టుగా తెలుస్తోంది.
చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా మాత్రం చకచకా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా సీరియస్‌గా ఉంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. 4 చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ, హెచ్ఎండీఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. అనుమతుల విషయంలో గతంలో కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో పని చేసిన జోనల్ కమిషనర్ల నుంచి హైడ్రా వివరణ తీసుకుంది. హైడ్రాలిస్టులో పలువురు మున్సిపల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డీసీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి హైడ్రా బలోపేతం కావడంతో అటు చెరువుల్లో నిర్మాణాలు చేసిన వారికి.. అనుమతులు ఇచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మరికొందరైతే ముందుగానే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ నిర్మాణాలను కూల్చకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకునే యత్నంలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చూస్తే అన్నాతమ్ముళ్లనేది కూడా చూడబోనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా సరే.. అక్రమ నిర్మాణం చేసినట్టు తన దృష్టికి వస్తే పక్కాగా కూల్చేస్తానని చెబుతున్నారు.
Updated Date - Aug 30 , 2024 | 11:25 AM