Kamareddy: పోలీసుల అదుపులో కామారెడ్డి డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్
ABN, Publish Date - May 16 , 2024 | 05:48 AM
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
మహిళా ఉద్యోగుల ఫిర్యాదులతో ఇరువురిపై పలు సెక్షన్ల కింద కేసులు
కామారెడ్డి టౌన్, మే 15: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్ తనిఖీల పేరిట వస్తూ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లాలోని పలు పీహెచ్‌సీలకు చెందిన 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు 10 రోజుల కింద వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ‘పీహెచ్‌సీకి వచ్చినప్పుడు డీఎంహెచ్‌వో పక్కన కూర్చొమనేవారు.. కూర్చోకపోతే పనిలో లోపాలు వెతికి వేధించేవారు.
ఫోన్ చేసి మరీ సంసారం జీవితం ఎలా సాగుతుందంటూ అభ్యంతరకరంగా మాట్లాడేవారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడీహెచ్ (అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్) అమర్‌సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇరు వర్గాలను పిలిపించి.. వారితో మాట్లాడారు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడికి చేరుకోగా.. వేధింపుల విషయాన్ని పలువురు మహిళా ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే తప్పుబట్టారు. బాధిత మహిళా ఉద్యోగులతో పాటు మరికొందరు అధికారులూ ఇక్కడికి రావాలన్నారు. డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ఉద్యోగాల నియామకాలు, డిప్యుటేషన్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏడీహెచ్ అమర్‌సింగ్.. డీఎంహెచ్‌వోతో పాటు ఇతర ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని రికార్డు చేశానని, విచారణ నివేదికలో వాటిని పొందుపర్చి.. ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Updated Date - May 16 , 2024 | 05:48 AM