కామన్ మెనూ అమలు చేయలేం..
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:31 AM
వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావించింది.
- ప్రస్తుత ధరలతో సాధ్యం కాదు..
- ఇబ్బందుల్లో సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు
- కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేత
గణేశ్‌నగర్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఇటీవల ప్రభుత్వం నూతన మెనూను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతీ రోజు ఇదే మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్‌రేడ్డితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నూతన మెనూ అమలును హాస్టళ్లలో అట్టహాసంగా ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రారంభించారు. ప్రస్తుత ధరలతో ఈ మెనూ అమలు సాధ్యం కాదని వార్డెన్లు చెబుతున్నారు.
నూతన మెనూ ప్రకారం ప్రతీ రోజు వివిధ రకాల కూరలతోపాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు అందించాలి. ఇవన్నీ అమలు చేయాలంటే ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు సరిపోవని చెబుతున్నారు. మెనూ అమలుకు జిల్లా సంక్షేమాధికారులు ఒత్తిడి తేవడం భావ్యం కాదంటున్నారు. దీంతో వార్డెన్లు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే మెనూ అమలులో ఇబ్బందులను వినతి పత్రాల ద్వారా తెలిపారు. కామన్ మెనూ రాకముందే పెరిగిన మెస్ ఛార్జీలతో విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని వార్డెన్లు చెబుతున్నారు. మెస్ ఛార్జీలు పెరిగినప్పుడు విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల పరిమాణం (గ్రాములు) పెరగాలి కానీ కామన్ మెనూలో ఆహార పదార్థాల పరిమాణం (గ్రాములు) తగ్గించడం వల్ల నాణ్యమైన ఆహారం పిల్లలకు ఎలా అందుతుందని ప్రశిం్నఆచరు. ఇప్పటికే పెంచిన మెస్ చార్జీల ప్రకారము చికెన్ కళాశాల విద్యార్థులకు 150 గ్రాములు వుంటే, కామన్ మెనూలో 70 గ్రాములు నుంచి 100 గ్రాములు మాత్రమే వున్నది. మటన్ 50 గ్రాములు మాత్రమే వున్నది. ఇలా చూస్తే అన్నీ ఆహార పదార్థాల పరిమాణం (గ్రాములు) తగ్గించారు.
మెనూ ఖర్చు వివరాలు ప్రకటించాలి..
నూతన మెనూ అమలు చేయాలంటే ముందుగా ఆహార పదార్థాల ధరలు, ఒక్కో విద్యార్థికి ప్రతి రోజు ఆహారంలో అందించాల్సిన కూరలు, వాటి పరిమాణాన్ని, ఖర్చుల వివారాలు ప్రకటించాలని వార్డెన్లు అంటున్నారు. అప్పుడే విద్యార్థుల సంఖ్యను బట్టి నూతన మెనూ అమలు చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో వివిధ రకాల అప్రూవల్ డీపీసీ (డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ) రేట్లు ఉన్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో ఇచ్చిన విధంగా గ్యాస్‌తో సహా అన్ని వస్తువులు టెండర్ ద్వారా సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.
మూడు స్లాబ్‌లు.. ఒకే మెనూ
ప్రభుత్వం పెంచిన కొత్త డైట్ చార్జీలను మూడు స్లాబ్‌లలో ఇచ్చింది. మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు 1,330 రూపాయలు, ఎనిమిది నుంచ పదో తరగతి విద్యార్థులకు 1,540, ఇంటర్, పీజీ విద్యార్థులకు 2,100 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ మూడు స్లాబ్‌లలో ఉన్న విద్యార్థులకు కామన్ మెనూ ఇచ్చింది. ఇది ఎలా అమలు చేయాలో తెలపలేదు. దీంతో వార్డెన్లు ఇబ్బందిపడుతున్నారు. కామన్ మెనూ అమలు సాధ్యసాధ్యాలపై సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో 54 సంక్షేమ హాస్టల్స్
జిల్లా వ్యాప్తంగా 54 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో 6,950 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహాల్లో సరిపడా నాలుగో తరగతి సిబ్బంది లేరు. ఉన్నవారికి కొత్త మెనూ లో ఉన్న ఆహార పదార్థాలు వండడంలో నైపుణ్యం లేదు. వారికి శిక్షణ ఇచ్చి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాలుగో తరగతి సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, పప్పు, సాంబారు మాత్రమే ఇస్తున్నారు. రాత్రి సమయంలో అన్నం, ఏదైనా కాయగూరలతో కూర, మజ్జిగతోపాటు వారంలో ఐదు రోజులు కోడిగుడ్డు ఇస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన నూతన మెనూ అమలు చేయాలంటే ఒక్కో విద్యార్థికి వంద రూపాయలు కేటాయిస్తేనే సాధ్యమవుతుందని అంటున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని మెనూ సిద్ధం చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన మెనూ అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ వార్డెన్లు జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశారు. ధరలు, గ్రాములు ప్రకటించకుండా మెనూ అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
గురుకులాల్లో కాస్త మెరుగు
ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు విషయంలో గురుకుల విద్యాలయాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గురుకులాలకు ఆహారం అందించే బాధ్యతను ప్రభుత్వం పైవ్రేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. రోజు వారీగా విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాల్సిన కూరగాయలు, కిరాణ సరుకులు, పండ్లు, చికెన్, మటన్, గుడ్లు, పాలు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వచ్చిన సరుకులు, కూరగాయలను విద్యార్థులకు వండి పెట్టే పనిని ఏజెన్సీలకు అప్పగించారు.
Updated Date - Dec 24 , 2024 | 01:31 AM