విలీనంపై రగడ
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:29 AM
కరీంనగర్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోపి ఒక మున్సిపాలిటీ, ఆరు గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కరీంనగర్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. విలీన గ్రామాల నుంచి అభ్యంతరాలెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేచింది.
కరీంనగర్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోపి ఒక మున్సిపాలిటీ, ఆరు గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కరీంనగర్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. విలీన గ్రామాల నుంచి అభ్యంతరాలెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేచింది. మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం మరో ఆరు వారాల్లో ముగియనుండడంతో నగరంపై పట్టును నిలుపుకునే క్రమంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా విలీన ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చి బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. దీనిని జీర్ణించుకుకోలేని బీఆర్‌ఎస్ వర్గాలు కౌంటర్‌గా విలీన గ్రామాల నుంచి అభ్యంతరాలను ఉద్యమ రూపం దాల్చే విధంగా పావులు కదుపుతున్నాయి.
ఫ బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్
కరీంనగర్ రాజకీయాలపై తమదైన ముద్రను వేసుకున్న వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో విలీనవివాదం కాస్తా రాజకీయ రగడగా మారింది. తనను సంప్రదించకుండానే విలీన ప్రతిపాదనలు ఎలా చేస్తారంటూ గంగుల కమలాకర్ అసెంబ్లీలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించే క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక మున్సిపాలిటీ, మరో ఆరు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిఽధిలో విలీనం చేసేందుకు చొరవ చూపి సఫలీకృతులయ్యారు. దీనిని జీర్ణించుకోలేక మాజీ మంత్రి గంగుల కమలాకర్ డైరెక్షన్‌లో బీఆర్‌ఎస్ నేతలు విలీన గ్రామాల నుంచి తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విలీనం జరిగిపోయినా కూడా ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికే బీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఫ నాడు.. నేడు
కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్, కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, చింతకుంట, లక్ష్మీపూర్ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఇవన్నీ కరీంనగర్‌కు పది కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రతిపాదనలు పంపించారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నగర శివారులోని ఎనిమిది గ్రామాలను విలీనం చేశారు. పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, అల్గునూర్, సదాశివపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. నగరాన్ని ఆనుకొని ఉన్నా బొమ్మకల్, చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను కార్పొరేషన్‌లో కలపకపోవడంపై ఆ సమయలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఫ మారని బతుకు బండి
గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం కావడంతో ప్రత్యేకించి ఒరిగేదేమీ ఉండదనే భావన బలంగా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామీణ ప్రాంత రైతులు అంటున్నారు. గతంలో విలీనం చేసిన, తాజాగా విలీనమైన గ్రామాలన్నీ వ్యవసాయాధారిత ప్రాంతాలు. రియల్ ఎస్టేట్ రంగానికి మినహా ఇక్కడ ప్రత్యేకించి జరిగిన అభివృద్ధి ఏమీ ఉండడం లేదు. పన్నుల భారంతోపాటు అభివృద్ధి పనులు సక్రమంగా జరగకపోవడం, ఏ చిన్న అవసరమైనా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సి రావడం, తమ ప్రాంతాల్లో కనీస వసతులు కూడా కల్పించకపోయినా ప్రశ్నించే అవకాశం లేకపోవడం వంటి వాటిని గతంలో విలీనమైన గ్రామాల ప్రజలు గుర్తు చేస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన కొత్తగా విలీనమైన గ్రామాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ఉపాధి హామీ వంటి పథకాలు నిలిచిపోనున్నాయి. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలకు మూడేళ్ల వరకు పన్నుల భారం ఉండకపోయినా భవిష్యత్‌లో పన్నులు పెరిగితే ఇబ్బందిగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.
ఫ ఆందోళనలు ప్రారంభం
విలీనంతో తమకు నష్టం జరుగుతోందంటూ ఇప్పటికే దుర్శేడు గ్రామ ప్రజలు బీఆర్‌ఎస్ నేతల సూచన మేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వెలిబుచ్చారు. సోమవారం చింతకుంట గ్రామస్థులు విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కల్పిస్తున్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీని కార్పొరేషన్‌లో విలీనం చేయడంపై ఇప్పటికే అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వీటన్నింటి వెనుక బీఆర్‌ఎస్ నేతలే సూత్రధారులుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. గతంలో నగరానికి దూరంగా ఉన్న వల్లంపహాడ్ గ్రామాన్ని విలీనం చేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు పది అడుగుల దూరం కూడా లేని చింతకుంటను విలీనం చేయడంపై ఆందోళనకు పురిగొల్పడం రాజకీయ దురుద్ధేశమే తప్ప మరొకటి కాదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల మధ్య కొనసాగుతున్న ఆధిప్యత పోరుకు తాజాగా జరిగిన విలీన ప్రక్రియ వేదికగా మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Dec 25 , 2024 | 01:30 AM