ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజకీయంగా కీలక పరిణామాలు

ABN, Publish Date - Dec 27 , 2024 | 01:05 AM

దశాబ్ద కాలంపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవం చవిచూపాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

దశాబ్ద కాలంపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవం చవిచూపాయి. కూలబడ్డ చోటే కుదురుకొని లేచి నిలబడి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2023 సంవత్సరం చివరి నెలలో వెలువడ్డ ఫలితాలు కొత్త సంవత్సరమైన 2024లో కొత్త రాజకీయాలకు తెరతీశాయి. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా సత్తా చాటుకోలేక పోయినా గౌరవ ప్రదమైన స్థానాలనే గెలుచుకున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ తన స్థానాలను కాపాడుకోలేక పోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒకే స్థానానికి పరిమితమైపోగా 12 స్థానాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ అధికారాన్ని చేపట్టి పాలనను అందించింది. 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో పరిస్థితులు తారుమారయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఐదు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇటీవల జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో తొమ్మిది స్థానాలతో కాంగ్రెస్‌ అధికార పార్టీగా ఏడాదిగా పాలనను అందించింది.

జిల్లా నేతలకు కీలక పదవులు

కరీంనగర్‌ జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చెరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. కరీంనగర్‌, హుజురాబాద్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి గెలుపొందారు. చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మేడిపల్లి సత్యం, డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ జిల్లాలోనే ఉన్న సైదాపూర్‌, చిగురుమామిడి మండలాలు హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందగా, ఆ నియోజకవర్గంలో కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో జిల్లాలో కాంగ్రెస్‌ ఏడాది పాలనను అందించి ఆరు గ్యారెంటీ పథకాలను అమల్లోకి తెస్తోంది. ఈయేడాది కాలంలో జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన నేరెళ్ల శారదను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి వరించింది. జిల్లా మొత్తానికి విస్తరించిన శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ (సుడా) చైర్మన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నియమితులయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన సత్తు మల్లేశం బాధ్యతలు చేపట్టారు. మానకొండూర్‌ నియోజకవర్గంలో మానకొండూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా మర్రి ఓదెలు, బెజ్జంకి మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా పులి కృష్ణ, ఇల్లంతకుంట మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా ఐరెడ్డి చైతన్య నియమితులయ్యారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఐదు మార్కెట్‌ కమిటీలకు కొత్త అధ్యక్షులు వచ్చారు. చొప్పదండి ఎఎంసీ చైర్మన్‌గా కొత్తూరి మహేశ్‌, గోపాల్‌రావుపేట చైర్‌పర్సన్‌గా బొమ్మరవేని తిరుమల, మల్యాల మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా బత్తిని మల్లేశ్వరి, గంగాధర చైర్‌పర్సన్‌గ ఆ జాగిరపు రజిత, బోయినపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బోయిని ఎల్లేశ్‌ యాదవ్‌ బాధ్యతలు చేపట్టారు. హుజురాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా గూడూరి రాజేశ్వరి, జమ్మికుంట మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా పుల్లూరి స్వప్న నియమితులయ్యారు. పుల్లూరి స్వప్న బీసీ వర్గానికి చెందిన వారని ఆమెను ఎస్సీ రిజర్వు చేసిన జమ్మికుంట మార్కెట్‌ కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించడానికి వీలు లేదని కొందరు కోర్టుకు వెళ్లడంతో ఆమె బాధ్యతలు చేపట్టలేక పోయుమమారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో మార్కెట్‌కమిటీకి చైర్మన్‌ను నియమించలేదు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు

నియోజకవర్గంలో, రాజకీయ కేంద్రంగా ఉన్న కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఈ సంవత్సరం ఆరంభం వరకు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

మూడు పార్టీలు.. పోటాపోటీగా..

అసెంబ్లీ ఎన్నికల్లో చెరి రెండు స్థానాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నువ్వా..నేనా అన్నట్లు రాజకీయాలు నిర్వహిస్తూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన బీజేపీ 2024 మే నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నది. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌కుమార్‌ 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపొంది కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ తన బలాన్ని పెంచుకుని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు దీటుగా బీజేపీ ఎదిగింది. దీంతో ఈ మూడు పార్టీలు జిల్లాలో ప్రధాన పక్షాలుగా పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మూడు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

అన్ని పార్టీలదీ.. అదే పరిస్థితి

ఉమ్మడి జిల్లా పరిధిలో మంత్రులుగా డి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వీరిలో శ్రీధర్‌బాబు పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జిగా, పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించినా ఆయన పెద్దగా జిల్లాకు వచ్చింది లేదు. జిల్లా రాజకీయాల్లో పొన్నం ప్రభాకర్‌ కొంత చొరవ చూపిస్తున్నా పూర్తికాలపు మంత్రిగా ఎవరూ లేరు అనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో, కాంగ్రెస్‌శ్రేణుల్లోనూ ఉన్నది. బీజేపీకి కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్ని తానే అయి వ్యవహరిస్తుండగా బీఆర్‌ఎస్‌ వ్యవహారాలు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ పర్యవేక్షిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మాత్రం సంపూర్ణ బాధ్యత వహించే వారు లేక పోవడంతో అధికారంలో ఉన్నా ఆ పార్టీశ్రేణుల్లో, ద్వితీయశ్రేణి నేతల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ చురుకుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువైన కరీంనగర్‌ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జి తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ సమావేశం నిర్వహించడం పార్టీలో కలకలం సృష్టించింది. ఆయనపై చర్య తీసుకోవాలని పార్టీలోని కొందరు సంతకాలు సేకరించి పీసీసీ అధ్యక్షుడికి పంపించారు. ఈ నియోజకవర్గంలో మార్కెట్‌ కమిటీతో సహా ఏ నామినేటెడ్‌ పోస్టు భర్తీ కావడం లేదు. పై స్థాయి పోస్టులు మాత్రం పై స్థాయి నాయకుల అండదండలతోనే వచ్చాయి తప్ప ఇక్కడి నాయకుల ప్రమేయంలేదు.

గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన

2024 జనవరి 29న సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. మండల, జిల్లా పరిషత్‌ల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం జూలైతో ముగిసింది. వాటికి ఎన్నికలు నిర్వహించాల్సిఉన్నది. కొత్తపల్లి మున్సిపాలిటీని, ఐదు గ్రామపంచాయతీలను కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా మరో 10 గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఈ సంవత్సరం ముగిసేలోగానే ఆ ఉత్తర్వులు కూడా వెలువడవచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - Dec 27 , 2024 | 01:05 AM