ఆదాయ వనరుగా సహజ ఉత్పత్తులు
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:46 AM
కొద్దిపాది శిక్షణతో సహజ ఉత్పత్తుల తయారీని ఆదాయ వనరుగా మార్చుకున్నది మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన పల్లెర్ల పవిత్ర. ప్రకృతిలో దొరికే పవ్వులు, ఆకులు, వేర్లతో హెయిల్ ఆయిల్, షాంపూ, సున్నిపిండి, హెన్నా తయారుచేస్తోంది. మొదట్లో వ్యాపారంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నా ధైర్యంగా వాటిని అధిగమించింది.
- పువ్వులు, ఆకులు, వేర్లతో తయారీ
- డీఆర్‌డీఏ, ఐకేపీ సహకారంతో విక్రయాలు
కాల్వశ్రీరాంపూర్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కొద్దిపాది శిక్షణతో సహజ ఉత్పత్తుల తయారీని ఆదాయ వనరుగా మార్చుకున్నది మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన పల్లెర్ల పవిత్ర. ప్రకృతిలో దొరికే పవ్వులు, ఆకులు, వేర్లతో హెయిల్ ఆయిల్, షాంపూ, సున్నిపిండి, హెన్నా తయారుచేస్తోంది. మొదట్లో వ్యాపారంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నా ధైర్యంగా వాటిని అధిగమించింది. ప్రస్తుతం తన ఉత్పత్తుల అమ్మకాల ద్వారా నెలకు పదివేల రూపాయల వరకు సంపాదిస్తోంది.
ఫ స్వశక్తి సంఘంలోని పలువురు సభ్యులకు నాలుగేళ్ల క్రితం డీఆర్‌డీఏ, ఐకేపీ అధికారులు హెర్బల్ ఉత్పత్తుల తయారీపై హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో దొరికే పవ్వులు, ఆకులు, వేర్లతో హెయిల్ ఆయిల్, షాంపూ, సున్నిపిండి, హెన్నా తయారీని నేర్పించారు. అలా శిక్షణ పొందిన స్వశక్తి సంఘ సభ్యురాలైన పల్లెర్ల పవిత్ర ఇంటివద్దనే వాటిన తయారు చేసి విక్రయిస్తూ ఆదాయం పొందుతోంది. 2019లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉత్పత్తులు తయారీలో వారం రోజులు శిక్షణ పొందారు. ఆరుగురు శిక్షణ పొందగా ఐదుగురు వివిధ కారణాలతో విరమించుకోగా, పల్లెర్ల పవిత్ర మాత్రం పట్టుదలతో కష్టనష్టాలకు ఓర్చి హెర్బల్ ఉత్పత్తులను తయారుచేసి కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, చొప్పదండి తదితర ప్రాంతాల్లోని దుకాణాల ద్వారా అమ్ముతోంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో శిక్షణ పొందిన తర్వాత స్వశక్తి గ్రూపులో రుణం తీసుకొని ఉత్పత్తుల తయారీ కొనసాగిస్తోంది.
ఫ నాలుగేళ్లుగా తయారీ..
ప్రకృతిలో దొరికే తులసి, మందార, కుంకుడుకాయ, అలోవేరా, వేపాకు, మర్రిఊడలు, గులాబీ, గోరింటా, గలిజేరు, తుంగగడ్డలు తదితర వాటిని తయారీకి వినియోగిస్తోంది. 2020 మార్చి 8 అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజు అప్పటి కలెక్టర్ దేవసేన పవిత్ర తయారుచేసిన సున్నిపిండి, హెయిర్ ఆయిల్, షాంపూ, హెన్నాను డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతర పవిత్రను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, పలువురు మహిళలు హెర్బల్ ఉత్పత్తులను కొనుగోలు చేశారని పవిత్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పూలు, చెట్లు, ఆకులు, వేర్లతో తయారు చేసే ఈ హెర్బల్ ఉత్పత్తులు వాడడం వలన ఎలాంటి హాని ఉందన్నారు. ఈ నాలుగు ఉత్పత్తులతో నెలకు పదివేల వరకు ఆదాయం వస్తోందని పవిత్ర పేర్కొన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా డీఆర్డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో తాను తయారుచేసిన ఉత్పత్తుల స్టాల్స్‌ను నాలుగేళ్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీఏ, ఐకేపీ సహకారంతో హైదరాబాద్‌లోని శిల్పారామంలో కూడా స్టాల్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పవిత్ర తెలిపారు.
Updated Date - Dec 22 , 2024 | 02:46 AM