కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:18 AM
‘వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం..
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
‘వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం. రాత్రి వేళల్లో స్ర్టీట్ లైట్ల కారణంగా లోడ్ అధికమై సింగిల్ ఫేజ్ సరఫరా చేస్తున్నాం. అది కూడా కొంత సమయం మేరకే పరిమితం చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఇకపై వారానికి రెండు రోజులు కోతలు విధించకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు మా శాఖ సిబ్బంది 24/7 వినియోగదారులకు అందుబాటులో ఉంటారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట నిర్వహిస్తున్నాం. వేసవిలో వచ్చే విద్యుత్ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నాం’.. అని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) మేక రమేశ్‌బాబు అన్నారు. కొద్ది నెలలుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువ కావడం, ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడం, పట్టణ ప్రాంతాల్లో వారంలో రెండేసి రోజులు సరఫరాను నిలిపివేయడం వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎస్‌ఈని కలిసి ఆయా అంశాలను ప్రస్తావించింది. విద్యుత్‌శాఖ ఉద్యోగుల అవినీతి, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆం ధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ సమగ్ర పాఠం...
ఆంధ్రజ్యోతి: ఇటీవల విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి.. గతంలో పట్టణాల్లో ఒక్క రోజు మాత్రమే మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేసేవారు. ప్రస్తుతం రెండు రోజులు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు.. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ రావడం లేదు.. కారణాలేమిటి?
ఎస్‌ఈ: వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్నాం.. సాయంత్రం వేళల్లో మాత్రమే స్ట్రీట్ లైట్ల కారణంగా లోడ్ ఎక్కువ అవుతున్నది. అధికారుల ఆదేశాల మేరకు కొంత సమయం మేరకు సింగిల్ ఫేజ్ సరఫరా చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఇకపైన వారానికి రెండురోజులు కోతలు లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తెస్తున్నాం. పది సబ్ స్టేషన్లతో విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నాం.. ఇకపై విద్యుత్ కోతలనేవి ఉండవు. ఓవర్ లోడ్ ఉన్న చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన చోట పాతవాటి సామర్థ్యాన్ని పెంచుతున్నాం. వేసవిలో వచ్చే సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం.
జిల్లాలో ఏ కేటగిరిలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి?
- సర్కిల్ పరిధిలో 3,78,969 గృహ విద్యుత్ కనెక్షన్లు, 1,01,903 వ్యవసాయ కనెక్షన్లు, 6,306 పరిశ్రమల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 5,47,251 విద్యుత్ కనెక్షన్ల ద్వారా వినియోగదారులకు సరఫరాను అందిస్తున్నాం.
ఫ: వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు తరచుగా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని రిపేర్ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో మీ తీసుకుంటున్న చర్యలేమిటి?
- జిల్లాలో 22,404 వ్యసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఒ క్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు షెడ్యూల్ ఖరారు చేసి మెయింటెనెన్స్ చేయిస్తాం. వాటి సమీపంలో ఉండే చెట్లను తొలగించడంతోపాటు ఎర్తింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ చర్యలతో ట్రాన్స్‌ఫార్మర్లు తరచు మరమ్మతులకు రావడాన్ని నిరోధిస్తాం.
జిల్లాలో ఎన్ని సబ్‌స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా సబ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తున్నారా ?
- జిల్లాలో పది 132 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా మూడు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.. వేసవి యాక్షన్ ప్లాన్ కింద 132 కేవీ, 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం.. సబ్ స్టేషన్ల మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా కరీంనగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లలో సరఫరా నిలిపివేయకుండా మరమ్మతులు చేపట్టేందుకు ట్రయల్ రన్ నిర్వహించాం. అందులో సక్సెస్ అయ్యాం.. ఇకపై సబ్ స్టేషన్ల మరమ్మతుల పేరిట వి ద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగదు.
జిల్లాలో కొత్తగా సబ్‌స్టేషన్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా?
- ఐదు కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మూడు నెలల్లో అవి అందుబాటులోకి వస్తాయి.
జిల్లాలో గృహజ్యోతి పథకం ద్వారా ఎంత మంది లబ్ది పొందుతున్నారు?
- జిల్లాలో ప్రతినెలా 1,54,629 మంది గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నారు. జీరో బిల్ ద్వారా వారు 6.73 కోట్ల రూపాయల సబ్సిడీ పొందుతున్నారు. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు లబ్దిపొందలేనివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో, నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రేషన్‌కార్డులు ఉన్నవారికే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది.
విద్యుత్‌శాఖలో అవినీతి ఎక్కువైందని, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి.. వీటిపై మీ అభిప్రాయం ?
- లంచం ఆశించే అధికారులు, ఉద్యోగులపై, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండే వారిపై నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. అవినీతి నిరోధక శాఖకు గానీ, టోల్‌ఫ్రీ నంబర్ 1912కుగానీ ఫిర్యాదు చేసేందుకు వీలుంది.
ప్రజావాణి ఫిర్యాదుల పరిస్థితి ఏమిటి?
- కరీంనగర్ సర్కిల్ పరిధిలో ఆన్‌లైన్ పద్ధతులను పాటిస్తూ పారదర్శకంగా ఉండేలా చూస్తున్నాం. ప్రజావాణి ఫిర్యాదులకు పోర్టల్‌ను ఏర్పాటు చేశాం. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం బహిరంగ విచారణ సదస్సులను నిర్వహిస్తున్నాం. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు మా సిబ్బంది 24/7 అందుబాటులో ఉంటారు.
Updated Date - Dec 20 , 2024 | 01:18 AM