Srisailam Temple: శ్రీగిరి కిటకిట..
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:36 AM
ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీశైలంలో దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
శ్రీశైలం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు, ప్రధాన వీధుల్లో రద్దీ నెలకొంది. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మకు దీపహారతులు, నైవేద్యాలు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులుదీరారు.
కార్తీకమాసం శని, ఆది, సోమవారం రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించి దీపారాధనలు చేశారు. సాయంత్రం ప్రధాన ధ్వజస్థభం వద్ద శాస్త్రోక్తంగా ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం తదితర ఆర్జిత సేవా టికెట్లను దేవస్థానం ఆన్లైన్ ద్వారా పొంది శ్రీశైలానికి రావాలని అధికారులు సూచించారు.
Updated Date - Nov 18 , 2024 | 04:36 AM