Padi Koushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి.. హీటెక్కిన గ్రేటర్.. బ్రోకర్ అంటూ..
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:31 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య వ్యవహారం మరింత హీటెక్కుతోంది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల వ్యవహారం మరింత హీటెక్కింది. నగరంలోని మాదాపూర్‌లో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లారు. దీంతో అక్కడ రచ్చరచ్చ జరిగింది. కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను తోసుకొని లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై కోడిగుడ్లు, టమాటాలు విసిరినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇంటి అద్దాలు కూడా పగిలినట్టుగా సమాచారం. ఊహించని పరిణామంతో అక్కడ బీతావాహ పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నియంత్రించడం పోలీసులకు కూడా కాస్త కష్టంగా మారింది. అయినప్పటికీ పోలీసులు అరికపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఇంటికి తరలించారు.
అరికపూడి ఏమన్నారంటే..
పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తానని రాలేదు కాబట్టే తాను ఆయన ఇంటికి వెళ్లానని అన్నారు. ‘‘ నా ఇంటికి నువ్వు రాలేకపోయావ్.. నేనే మీ ఇంటికి వచ్చా. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్. కౌశిక్ రెడ్డి వచ్చాక బీఆర్ఎస్ నాశనమైంది. అతడి వల్లే పార్టీ ఓడిపోయింది’’ అని అన్నారు.
రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారు: పాడి కౌశిక్ రెడ్డి
తన ఇంటిపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడిన ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ‘‘ గాంధీ తన రౌడీలను తీసుకొని నా ఇంటి మీదకు వచ్చాడు. నాపై హత్యాయత్నం చేశారు. పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. ఈ చర్యకు కచ్చితంగా ప్రతి చర్య ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో మీరు చూస్తారు. రేపు కచ్చితంగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి తీరుతా’’ అని అన్నారు.
దాడి ఘటనకు ముందు కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూఅరికపూడి గాంధీపై మండిపడ్డారు. ‘బ్రోకర్‌వి నువ్వా నేనా.. టీడీపీలో గెలిచి బాబును మోసం చేశావు.. బీఆర్ఎస్‌లో గెలిచి కేసీఆర్‌ను మోసం చేశావు’ అని నిందించారు. ‘మిస్టర్ గాంధీ గుర్తు పెట్టుకో.. సీఎం అవుతానని చెప్పుకున్న ఈటెలను బొంద పెట్టిన మగాణ్ణి నేను.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎక్కడ నుంచో వచ్చి నాకు సవాల్ చేస్తే ఊరుకుంటానా?’ అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
రేపు ఉదయం 11గంటలకు మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుని నాయకత్వంలో గాంధీ ఇంటికి వెళతామని కౌశిక్ రెడ్డి తెలిపారు. జిల్లా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంతా రావాలని పిలుపునిస్తున్నానన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుమతితో చెబుతున్నానన్నారు. ‘నీకు నాకు ఏమైనా తగాదాలు ఉన్నాయా? నీకు నాకు ఏం పంచాయితీ? బీఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిగ్గు అనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. మగాడివి ఐతే రాజీనామా చేసి మళ్లీ గెలువాలంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అక్కడే మీ బలం, మా బలం ఏంటో తేల్చుకుందామన్నారు. అప్పుడు మొనగాడివి అని ఒప్పుకుంటానని కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌లో ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
గాంధీ ఇంటికి బయలుదేరుతా అనగానే తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తనను ముందస్తుగా అరెస్ట్ చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తాను కూడా గాంధీకి సహచర ఎమ్మెలేనేనని అన్నారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉంటే ఇద్దరం కలిసి బీఆర్‌ఎస్ భవన్‌కు వెళతామన్నానని.. దానికి గాంధీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ మారనప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి ఎందుకు అభ్యంతరం? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో చేరానన్నది మీరే కదా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మీకెందుకు అంత భయం అవుతుందని నిలదీశారు. ‘బ్రోకర్ కౌశిక్ రెడ్డి బ్రోకర్ అన్నావు కదా.. నీవా బ్రోకర్.. నేనా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబును, కేసీఆర్‌ను అందరినీ మోసం చేసావన్నారు. ‘నువ్వు ముసలోడివి నేను యంగ్’ అంటూ కౌశిక్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగారు. ఈటెల రాజేందర్ ను 100 కిలో మీటర్ల లోపల పాతిపెట్టి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేశానన్నారు. రేపు ఉదయం 11 గంటలకు శాంబీపూర్ రాజు ఇంటి నుండి బయలుదేరి గాంధీ ఇంటికి వెళ్తామని.. జీహెచ్ఎంసీలోని ప్రతీ బీఆర్ ఎస్ కార్యకర్త గాంధీ ఇంటికి వెళ్లి అక్కడే టిఫిన్ చేద్దామంటూ పిలుపునిచ్చారు. గాంధీని బీఆర్ ఎస్ భవన్ కు తీసుకువెళ్లి అక్కడే ప్రెస్‌మీట్ పెడతామన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 01:43 PM